
అర్ధరాత్రి పిటిషన్లు తయారు చేస్తున్నారా?: సుప్రీం ఆగ్రహం
ఆధారాలు లేని, అర్థంలేని ప్రజాహిత వ్యాజ్యాలు (పీఐఎల్) దాఖలు చేసిన న్యాయవాదిపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే న్యాయవాది దాఖలు చేసిన ఐదు ‘అసంబద్ధ’ పిటిషన్లను కోర్టు సోమవారం కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. బెంచ్‌లో న్యాయమూర్తి జోయ్‌మాల్య బాగ్చీ కూడా ఉన్నారు. పిటిషనర్‌గా హాజరైన అడ్వకేట్ సచిన్గుప్తాపై ప్రధాన న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఆధీ రాత్ కో యే సబ్ పిటిషన్ డ్రాఫ్ట్ కర్తే హో క్యా? (మీరు ఇవన్నీ అర్ధరాత్రి కూర్చొని తయారు చేస్తారా?)’ అని ప్రశ్నించారు. ఈ పిటిషన్లు స్పష్టతలేని, అసంబద్ధమైనవి, ఆధారాలు లేనివి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పిటిషన్లలో ఒకదానిలో ఉల్లిపాయ, వెల్లుల్లిలో ‘తామసిక(మనసుకు భారంగా, మాంద్యం కలిగించే ఆహారాన్ని)’ లేదా ప్రతికూల శక్తి ఉందా అనే అంశంపై శాస్త్రీయ అధ్యయనం చేయడానికి కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ పిటిషన్లో జైన్ కమ్యూనిటీ ఆహార అలవాట్లను కూడా ప్రస్తావించారు. జైన మతానికి చెందిన చాలా మంది ఉల్లిపాయ, వెల్లుల్లి, భూమిలో పెరిగే కూరగాయలను ‘తామసిక ఆహారం’గా భావించి వాటిని తినకుండా ఉంటారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జైన సమాజ భావోద్వేగాలను ఎందుకు దెబ్బతీయాలనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. దానికి పిటిషనర్ స్పందిస్తూ ఇది సాధారణ సమస్య అని, గుజరాత్లో ఉల్లిపాయ వాడకం కారణంగా ఒక విడాకుల కేసు కూడా జరిగిందని చెప్పాడు. దీనిపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
మరో నాలుగు పిటిషన్ల కొట్టివేత
మరుసటి సారి ఇలాంటి అర్థంలేని పిటిషన్‌తో వస్తే ఏమి జరుగుతుందో చూస్తారని సీజేఐ హెచ్చరించారు. అదే న్యాయవాది దాఖలు చేసిన మరో నాలుగు పిటిషన్లను కూడా కోర్టు కొట్టివేసింది. వాటిలో మద్యం, పొగాకు ఉత్పత్తుల్లో ఉన్న హానికర కంటెంట్‌ను నియంత్రించాలన్న విజ్ఞప్తి, ఆస్తుల తప్పనిసరి నమోదు కోసం ఆదేశాలు ఇవ్వాలన్న అభ్యర్థన, క్లాసికల్ భాషల ప్రకటనకు మార్గదర్శకాలు రూపొందించాలన్న పిటిషన్ వంటి అంశాలు ఉన్నాయి. ఈ పిటిషన్లలో చేసిన అభ్యర్థనలు స్పష్టత లేకుండా, సరైన న్యాయపరమైన ఆధారం లేకుండా ఉన్నాయని బెంచ్ పేర్కొంది. ఈ పిటిషన్ సరైన ఆలోచన లేకుండా దాఖలు చేసిన మరో ఉదాహరణ. ఇందులో చేసిన అభ్యర్థనలు అస్పష్టంగా, ఆధారాలు లేనివిగా ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ల రూపకల్పన కూడా నాసిరకంగా ఉందని తెలిపింది. పిటిషనర్ ఒక న్యాయవాది కాకపోయి ఉంటే భారీ జరిమానా విధించే అవకాశం ఉండేదని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పష్టం చేశారు.
