Let's talk: editor@tmv.in
అరణ్యానికి సాంకేతికత రక్షణ కవచం: పవన్‌

అరణ్యానికి సాంకేతికత రక్షణ కవచం: పవన్‌

Pinjari Chand
21 ఆగస్టు, 2026

రాష్ట్రంలో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్‌ కళ్యాణ్‌ అధికారులను ఆదేశించారు. కర్ణాటక అటవీ శాఖ అనుసరిస్తున్న తరహాలో ఆధునిక సాంకేతిక పరిపాలనా వ్యవస్థను రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రతి అంగుళం అటవీ భూమిని పరిరక్షించాలని సూచించారు. నూతనంగా నిర్మిస్తున్న అరణ్యారామంలో ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీ) ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. దీని ద్వారా అడవుల మ్యాపింగ్‌తో పాటు వన్యప్రాణుల కదలికలు, అటవీ కార్యకలాపాలపై డిజిటల్‌ నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు.

కర్ణాటకలో అధ్యయనం

రాష్ట్ర అటవీశాఖ ఐటీ సలహాదారు పెన్నమరెడ్డి నాగబాబు ఆధ్వర్యంలో అటవీశాఖ బృందం ఇటీవల కర్ణాటకలో మూడు రోజుల పాటు పర్యటించింది. అక్కడి అటవీ శాఖ అమలు చేస్తున్న ఐటీ విధానాలు, జీఐఎస్‌, మొబైల్‌ అప్లికేషన్లు, ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ తదితర వ్యవస్థలను బృందం అధ్యయనం చేసింది. అధ్యయనానికి సంబంధించిన పూర్తి నివేదికను పవన్‌ కళ్యాణ్‌కు అధికారులు అందజేశారు. కర్ణాటకలో సత్ఫలితాలు ఇస్తున్న విధానాలను ఏపీలోనూ అమలు చేయాలని ఆయన అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌‌ ఏర్పాటు చేయాలి

కేంద్ర కార్యాలయం నుంచే అడవిలో ప్రతి అణువును పర్యవేక్షించేలా కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని పవన్‌ సూచించారు. జియో-స్పేషియల్‌ డ్యాష్‌బోర్డ్‌, డ్రోన్‌ ఆధారిత పర్యవేక్షణ, కెమెరా ట్రాప్‌లు వంటి సాంకేతికతలను వినియోగించాలని తెలిపారు. వన్యప్రాణుల సంఖ్య, వాటి కదలికలు, అటవీ మార్గాల్లో ప్రయాణించే వాహనాలు, గస్తీ కార్యకలాపాలు, అటవీ అగ్నిప్రమాదాలు, మానవ–వన్యప్రాణి ఘర్షణలను ఒకే వ్యవస్థ ద్వారా పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ-గస్తీతో సిబ్బంది పనితీరుపై నిఘా

కర్ణాటకలో అమలు చేస్తున్న ఈ-గస్తీ మొబైల్‌ అప్లికేషన్‌ను ఏపీలోనూ రూపొందించాలని పవన్‌ కళ్యాణ్‌ సూచించారు. క్షేత్రస్థాయి సిబ్బంది విధుల పర్యవేక్షణ, భద్రత, గస్తీ, హాజరు, మార్గ నిర్దేశం, నివేదికల సమర్పణకు ఈ యాప్‌ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఏపీ అటవీశాఖలో ఇప్పటికే అమలులో ఉన్న ఫారెస్ట్‌ పోర్టల్‌, సింగిల్‌ సైన్‌-ఆన్‌ వ్యవస్థలను అనుసంధానించి ఈ-గస్తీ యాప్‌ను రూపొందించాలని ఆదేశించారు. దీనివల్ల సిబ్బందిలో జవాబుదారీతనం మరింత పెరుగుతుందని తెలిపారు.

రైతులకు త్వరగా పరిహారం

వన్యప్రాణుల కారణంగా అటవీ సరిహద్దు గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లినప్పుడు పరిహారం చెల్లించే ప్రక్రియను కూడా డిజిటలైజ్‌ చేయాలని పవన్‌ కళ్యాణ్‌ సూచించారు. పంట నష్టంపై నివేదికల నమోదు నుంచి రైతులకు పరిహారం చెల్లించే వరకు మొత్తం ప్రక్రియలో పారదర్శకత తీసుకురావాలని తెలిపారు.

జీఐఎస్‌ ఆధారిత ధృవీకరణ వ్యవస్థను తక్షణమే అమలు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తద్వారా పంట నష్టాలపై వేగంగా నిర్ణయాలు తీసుకుని, బాధిత రైతులకు సత్వరమే పరిహారం అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

అరణ్యానికి సాంకేతికత రక్షణ కవచం: పవన్‌ - Tholi Paluku