Let's talk: editor@tmv.in
అయోధ్యలో ‘చందాచోరీ’ సరిపోలేదా?: ఖర్గే

అయోధ్యలో ‘చందాచోరీ’ సరిపోలేదా?: ఖర్గే

Pinjari Chand
21 ఆగస్టు, 2026

పీఎం కేర్స్‌ ఫండ్‌ ఖర్చులు, జవాబుదారీతనంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ప్రశ్నలు సంధించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫండ్‌ ఆర్థిక నివేదికను ప్రస్తావిస్తూ.. అత్యవసర పరిస్థితుల కోసం ఏర్పాటు చేసిన నిధిలో వేల కోట్ల రూపాయలు నిల్వ ఉండగా, ఆ ఏడాది చాలా స్వల్ప మొత్తమే ఖర్చు చేశారని విమర్శించారు. ఎక్స్‌లో చేసిన పోస్టులో ఖర్గే పేర్కొన్న వివరాల ప్రకారం.. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి పీఎం కేర్స్‌ ఫండ్‌లో సుమారు రూ.8,452 కోట్ల నిల్వ ఉంది. అయితే ఆ ఏడాది కేవలం రూ.87.85 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అంటే మొత్తం నిల్వలో దాదాపు 0.01 శాతం మాత్రమే ఖర్చయిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యవేక్షణలోనే పీఎం కేర్స్‌ ఫండ్‌, రామ మందిర ట్రస్ట్‌ ఏర్పాటయ్యాయని, రెండింటికీ విరాళాలు అందుతున్నాయని ఆరోపించారు. చందా చోరీ కోసం ఒక శ్రీరామ మందిర ట్రస్ట్‌ సరిపోలేదన్నట్టుగా ఉందంటూ ప్రధానిపై విమర్శలు గుప్పించారు.

జవాబుదారీతనం ఎక్కడ?

పీఎం కేర్స్‌ ఫండ్‌కు సంబంధించిన జవాబుదారీతనంపై కూడా ఖర్గే ప్రశ్నలు లేవనెత్తారు. ఈ నిధి ఆర్టీఐ పరిధిలోకి రాదని, కాగ్‌ ఆడిట్‌ లేదా పార్లమెంటరీ పర్యవేక్షణకు లోబడి లేదని ఆయన ఆరోపించారు. పీఎం కేర్స్‌ ఫండ్‌కు ప్రధానమంత్రి చైర్మన్‌గా, రక్షణ, హోం, ఆర్థిక శాఖల మంత్రులు ట్రస్టీలుగా ఉన్నారని ఖర్గే పేర్కొన్నారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌‌) విరాళాలతో పాటు పన్ను మినహాయింపు పొందే విరాళాలను కూడా ఫండ్‌ స్వీకరిస్తోందని తెలిపారు. ప్రధాని పేరుతో ఉన్న ఫండ్‌ సాధారణ ప్రజా పరిశీలన వ్యవస్థలకు ఎందుకు దూరంగా ఉంది? అని ఖర్గే ప్రశ్నించారు. అత్యవసర పరిస్థితుల కోసం ఏర్పాటు చేసిన నిధిలో వేల కోట్ల రూపాయలు పేరుకుపోతుండగా, 2024–25లో అందులో కేవలం 0.01 శాతం మాత్రమే ఎందుకు ఖర్చు చేశారని ఆయన ప్రశ్నించారు.

విరాళాలు, వడ్డీ ద్వారా ఆదాయం

ఖర్గే షేర్‌ చేసిన ఆర్థిక నివేదిక ప్రకారం.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో పీఎం కేర్స్‌ ఫండ్‌కు దేశీయ, విదేశీ విరాళాలు అందడంతో పాటు బ్యాంకు పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ కూడా లభించింది. కోవిడ్‌–19 మహమ్మారి వంటి అత్యవసర పరిస్థితులు, విపత్తులు, సంక్షోభాల సమయంలో బాధితులకు సహాయం అందించేందుకు ప్రధాని పౌర సహాయ, అత్యవసర పరిస్థితుల సహాయ నిధిని ఏర్పాటు చేశారు. 2020 మార్చి 27న న్యూఢిల్లీలోని రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌–1908 కింద పబ్లిక్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌గా ఇది నమోదైంది. జాతీయ సంక్షోభాల సమయంలో విరాళాలను స్వీకరించి, సహాయ కార్యక్రమాలకు వినియోగించేందుకు ఈ నిధిని ఏర్పాటు చేశారు.

అయోధ్యలో ‘చందాచోరీ’ సరిపోలేదా?: ఖర్గే - Tholi Paluku