
అమెరికాలో హైదరాబాద్ యువతి హత్య.. ఆగ్రాలో నిందితుడి అరెస్ట్
అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన యువతి నిఖిత గోదిశాల హత్య కేసులో నిందితుడిగా ఉన్న అర్జున్ శర్మ (26) ఆగ్రాలో పోలీసులకు చిక్కాడు. నగరంలోని లాలాగూడ పోలీస్ స్టేషన్లో నమోదైన మోసం కేసు దర్యాప్తులో భాగంగా అతడిని గుర్తించినట్లు పోలీసులు గురువారం తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఆనంద్ గోదిశాల ఫిర్యాదు మేరకు ఏప్రిల్‌లో అర్జున్ శర్మపై మోసం చేసిన కేసు నమోదైంది. తన కుమార్తె నుంచి డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు లభించిన ఆధారాల ఆధారంగా అర్జున్ ఆగ్రాలోని ఓ ఫ్లాట్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో లాలాగూడ పోలీసులు అక్కడికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకుని నోటీసు జారీ చేశారు.
అమెరికాలో హత్య కేసు
27 ఏళ్ల నిఖిత గోదిశాల అమెరికాలోని ఎల్లికాట్ సిటీలో నివసిస్తూ డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. జనవరి 2న ఆమె కనిపించకుండా పోయారు. అనంతరం మేరీల్యాండ్‌లోని కొలంబియాలో తన మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మ నివసించే అపార్ట్మెంట్లో నిఖిత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు హోవర్డ్ కౌంటీ పోలీసులు వెల్లడించారు. 2025 డిసెంబర్ 31 రాత్రి సుమారు 7 గంటల సమయంలో నిఖిత మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం అందించారు. జనవరి 4న ఉదయం సుమారు 6 గంటలకు ఆమెకు పలుమార్లు కత్తిపోట్లు తగిలినట్లు కుటుంబానికి అధికారికంగా తెలిపారు. నిఖితను హత్య చేసి అర్జున్ శర్మ అమెరికా నుంచి భారత్‌కు పారిపోయినట్లు అక్కడి పోలీసులు ఆరోపిస్తున్నారు. అతడిపై ఫస్ట్, సెకండ్ డిగ్రీ మర్డర్ అభియోగాలతో అరెస్టు వారెంట్ జారీ చేశారు.
ఢిల్లీ కోర్టుకు తరలింపు
అర్జున్‌పై అమెరికాలో కేసు నమోదై ఉండటంతోపాటు నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉన్న విషయాన్ని కేంద్ర అధికారులకు హైదరాబాద్ పోలీసులు తెలియజేశారు. అనంతరం కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు అతడిని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. ఆగస్టు 25న కోర్టు అతడిని హత్య కేసులో కస్టడీకి అప్పగించింది. అర్జున్ శర్మ 2025 ఆగస్టు–సెప్టెంబర్ ప్రాంతంలో ఉద్యోగం కోల్పోయిన అనంతరం నిఖిత, ఆమె కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు అప్పుగా తీసుకున్నట్లు నిఖిత తల్లిదండ్రులు తెలిపారు. నిఖితకు చెల్లించాల్సిన డబ్బుల విషయంలో ఆమె హత్యకు ముందే ఆర్థిక వివాదాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. అమెరికాలోని ఇతర వ్యక్తులతోనూ అర్జున్‌కు ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు కుటుంబం తెలిపింది.
