Let's talk: editor@tmv.in
అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్‌, ఏఐ యూనివర్సిటీ

అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్‌, ఏఐ యూనివర్సిటీ

Pinjari Chand
29 ఆగస్టు, 2026

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో దేశంలోనే తొలి ప్రత్యేకమైన క్వాంటమ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) యూనివర్సిటీ క్యాంపస్‌ ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. గురువారం జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. 8.5 ఎకరాల్లో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు ఐదేళ్లలో రూ.730.7 కోట్ల పెట్టుబడి అవసరమవుతుందని ప్రభుత్వం తెలిపింది. మొత్తం నిధులను కేంద్ర ప్రభుత్వం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో సమకూర్చనుంది. క్వాంటమ్‌ టెక్నాలజీస్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సెమీకండక్టర్లు, ఇతర అభివృద్ధి చెందుతున్న డీప్‌టెక్‌ రంగాలపై క్యాంపస్‌ ప్రధానంగా దృష్టి సారించనుంది. విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ఒకే వేదికపైకి తీసుకురానున్నారు.

సెప్టెంబర్‌ నుంచే కోర్సులు

అమరావతిలో శాశ్వత క్యాంపస్‌ నిర్మాణం పూర్తయ్యే వరకు గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తాత్కాలిక సదుపాయాల ద్వారా 2026 సెప్టెంబర్‌ నుంచే విద్యా, అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ సెక్యూరిటీ, ఏఐ-మెషిన్‌ లెర్నింగ్‌, డేటా సైన్స్‌, సెమీకండక్టర్‌ ఫ్యాబ్రికేషన్‌, చిప్‌ డిజైన్‌, వీఎల్‌ఎస్‌ఐ, ఏటీఎంపీ, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, హై పెర్ఫార్మెన్స్‌ కంప్యూటింగ్‌ తదితర విభాగాల్లో యూజీ, పీజీ, డాక్టోరల్‌, డిప్లొమా, ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌లు అందించనున్నారు.

1.2 లక్షల చదరపు అడుగుల్లో పరిశోధనా కేంద్రం

క్యాంపస్‌లో సుమారు 1.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్వాంటమ్‌ రీసెర్చ్‌, ఇన్నోవేషన్‌ అండ్‌ ఇంక్యుబేషన్‌ బ్లాక్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, కమ్యూనికేషన్‌, క్వాంటమ్‌ ఫోటోనిక్స్‌, సెక్యూరిటీ, క్రయోజెనిక్‌ సిస్టమ్స్‌, హై పెర్ఫార్మెన్స్‌ కంప్యూటింగ్‌, క్లీన్‌రూమ్స్‌, నానో ఫ్యాబ్రికేషన్‌, సెమీకండక్టర్‌ టెక్నాలజీ, చిప్‌ డిజైన్‌, డేటా సెంటర్లు, స్టార్టప్‌ ఇంక్యుబేషన్‌ సదుపాయాలు ఉంటాయి. ఐదేళ్లలో సుమారు 8,250 మందికి శిక్షణ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 1,650 మందికి డిగ్రీ కోర్సులు, 6,600 మందికి స్కిల్లింగ్‌, సర్టిఫికేషన్‌ కార్యక్రమాల ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. ఐదో ఏడాదికి వార్షికంగా సుమారు 3,913 మంది విద్యార్థులు, శిక్షణార్థులు చేరే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది.

ప్రముఖ విద్యాసంస్థలతో భాగస్వామ్యం

విద్యా కార్యక్రమాలు, పరిశోధన, సాంకేతిక అభివృద్ధి కోసం ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ శ్రీ సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్‌టీయూ తదితర సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేయనుంది. శాశ్వత క్యాంపస్‌లో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి, సోలార్‌ వాటర్‌ హీటింగ్‌, ఇంధన సామర్థ్య సదుపాయాలు, ఈవీ ఛార్జింగ్‌, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలు, స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌లు, ప్రయోగశాలలు, హాస్టళ్లు, 500 పడకల రెసిడెన్షియల్‌ సదుపాయం ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌, ఇండియా ఏఐ మిషన్‌, ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో డీప్‌టెక్‌ నైపుణ్యాలు, పరిశోధన, స్టార్టప్‌లు, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ యూనివర్సిటీ ప్రధాన లక్ష్యమని పేర్కొంది.

అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్‌, ఏఐ యూనివర్సిటీ - Tholi Paluku