
అమరావతిలో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం : మంత్రి నారాయణ
అమరావతి రాజధానిని ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది ఇందుకు అనుగుణంగా ఒలింపిక్ స్థాయి క్రీడా ఈవెంట్లను నిర్వహించే సామర్థ్యంతో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిర్మాణ పనులు ఏడాదిలోపే ప్రారంభమవుతాయని మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు.
మరోవైపు రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో భాగంగా అమరావతి మండలం యండ్రాయిలో మంత్రి నారాయణ, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ రైతులతో సమావేశమయ్యారు. శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామాల్లో రైతుల అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా నాలుగు గ్రామాల ప్రజలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. రైతు నంబూరి బలరాం తన 4 ఎకరాల భూమి పత్రాలు ఆర్డీవోకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజధానిలో భూముల విలువ పెరగాలంటే స్మార్ట్ ఇండస్ట్రీలు, విమానాశ్రయం, అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ సిటీ నిర్మాణం కీలకమని తెలిపారు. ఇవి ఉపాధి అవకాశాలు పెంపుతో పాటు ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి తోడ్పడతాయని చెప్పారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌లో రైతులు అందించే 7,000 ఎకరాల్లో 2,500 ఎకరాలను స్పోర్ట్స్ సిటీకి కేటాయించనున్నట్లు వెల్లడించారు.
ఇక రైతులకు కేటాయించే ప్లాట్లలో ముందుగా రోడ్లు, డ్రైనేజ్ వంటి మౌలిక వసతులు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ట్రంకు రోడ్లు, ప్రధాన రహదారుల నిర్మాణం, నాలుగు,ఆరు లైన్ల రహదారులను వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామ సభల ద్వారా ప్రజాభిప్రాయం సేకరణ ఇప్పటికే పూర్తయిందని అధికారులు మంత్రికి నివేదించారు.
రాజధాని నిర్మాణం ఆలస్యమైన కారణాలను ప్రస్తావించిన మంత్రి, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల పనులు నిలిచిపోయాయని, బిల్లులు క్లియర్ చేసిన వెంటనే భారీ వర్షాలు అడ్డుకట్టవేశాయని అన్నారు. ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చే రైతులకు క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపు ఇవ్వాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని పేర్కొన్నారు.
రాజధాని నిర్మాణంలో రైతులు చూపుతున్న విశ్వాసం, సహకారమే ప్రభుత్వానికి బలమని నారాయణ అభినందించారు. అమరావతిని ప్రతిష్టాత్మకమైన, ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
