Let's talk: editor@tmv.in
అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్ దివాకర
అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్ దివాకర

అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్ దివాకర

Gaddamidi Naveen
19 అక్టోబర్, 2026

ఖమ్మం నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచడంతో పాటు నాణ్యత, భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

ఖమ్మం కాల్వొడ్డు వద్ద మున్నేరు నదిపై నిర్మిస్తున్న తీగల వంతెన పనులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రఘునాథపాలెం మండలంలోని ప్రభుత్వ వైద్య కళాశాల, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పారస్ కుమార్‌తో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. సంబంధిత అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో మాట్లాడి పనుల ప్రస్తుత స్థితిగతులను తెలుసుకున్నారు.

వైద్య కళాశాల పనులపై ప్రత్యేక దృష్టి

ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణాన్ని దశలవారీగా పూర్తి చేసేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ సూచించారు. ప్రహరీ గోడ, హాస్టల్ భవనాలు, అంతర్గత రహదారులు, విద్యుత్ సరఫరా, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల పనులను సమాంతరంగా చేపట్టి వేగవంతం చేయాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వచ్చే విద్యా సంవత్సరం నాటికి వైద్య కళాశాలను అందుబాటులోకి తీసుకువచ్చేలా అవసరమైన అన్ని వసతులను సమకూర్చాలన్నారు. ముందుగా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్‌కు సంబంధించిన విద్యుత్ పనులను పూర్తి చేసి వినియోగానికి సిద్ధం చేయాలని సూచించారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌తో పాటు మిగిలిన నిర్మాణాలను నవంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. బాలికల హాస్టల్‌లో తుది పనులను త్వరగా పూర్తిచేసి, విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలన్నారు.

నవంబర్‌లోగా తీగల వంతెన పూర్తి

మున్నేరు నదిపై నిర్మిస్తున్న తీగల వంతెన పనులను నవంబర్ నెలాఖరులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. తుది దశ పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యత, భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్‌లో ప్రధాన భవనం, హాస్టళ్లు, వంటగది, భోజనశాల నిర్మాణాలను నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు నీటి సరఫరా పనులను త్వరగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా అన్ని నిర్మాణాలు పూర్తయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్ దివాకర - Tholi Paluku