
అధికారాన్ని కేంద్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నం: రాహుల్ గాంధీ
ఆర్ఎస్ఎస్, బీజేపీలు అధికారాన్ని కేంద్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాయని, అయితే కాంగ్రెస్ పార్టీ వికేంద్రీకరణకు, పునాది స్థాయి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని సీనియర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం అన్నారు. కొచ్చిలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ స్థానిక సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన మహాపంచాయత్ సమావేశంలో మాట్లాడిన ఆయన, మూడు స్థాయిల పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీనే రాజ్యాంగంలోని 73వ, 74వ సవరణలను తీసుకువచ్చిందని గుర్తు చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్రేగా) స్థానిక స్వయం ప్రభుత్వ సంస్థల ద్వారా అమలవుతుండటంతోనే ఎన్డీయే ప్రభుత్వం దానిపై దాడి చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడటం అంటే పునాది స్థాయి వికేంద్రీకృత పాలనను కాపాడటమేనని ఆయన స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యానికి మూలసూత్రం ఓటు అని, ఓటే ప్రజల స్వరం అని, ఆ స్వరాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు.
ప్రజలను మౌనంగా మార్చడానికే
బీజేపీ, ఆర్ఎస్ఎస్లు అధికారాల కేంద్రీకరణను నమ్ముతుంటే, కాంగ్రెస్ వికేంద్రీకరణను నమ్ముతుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. వారికి ప్రజల స్వరం కావాలని లేదు, ప్రజల నుంచి విధేయత మాత్రమే కావాలి. భారత్ ప్రజల స్వరం కాకుండా, వారి మాట వినిపించేలా చేయాలనుకోవడం లేదని విమర్శించారు. ప్రఖ్యాత మలయాళ రచయిత్రి ఎం. లీలావతి (98)తో అవార్డు కార్యక్రమంలో జరిగిన సంభాషణను గుర్తు చేస్తూ ఆమె నిశ్శబ్ద సంస్కృతి గురించి మాట్లాడిందని రాహుల్ చెప్పారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ల సిద్ధాంత దాడి ప్రజలను మౌనంగా మార్చడానికేనని ఆయన ఆరోపించారు. వాళ్లు భారత్ మౌనంగా ఉండాలని కోరుకుంటున్నారు. భారత్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరచకూడదనుకుంటున్నారు. దేశ సంపదను కొద్ది మంది వ్యాపారవేత్తలకు అప్పగించాలనుకుంటున్నారని అన్నారు. ప్రజలను మౌనంగా చేయడం ద్వారానే దేశ ఆస్తులను కొందరి చేతుల్లో కేంద్రీకరించవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, కేరళ ప్రజలను మౌనంగా చేయడం ఎవరికీ సాధ్యం కాదని, ఎన్నికల ద్వారానే వారు తమ స్వరాన్ని వినిపిస్తారని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, ముఖ్యంగా పంచాయతీ స్థాయిలో కాంగ్రెస్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ప్రదర్శనకు ఆయన పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. స్థానిక సంస్థల్లో అన్ని స్థాయిల్లో కాంగ్రెస్–యూడీఎఫ్ అద్భుతమైన ప్రదర్శన చేశాయని, ముఖ్యంగా పంచాయతీల్లో వచ్చిన ఫలితాలపై తాను చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు.
గెలిచాక ఏమి చేసేది ప్రజలకు చెప్పాలి
ఢిల్లీలో సీనియర్ నేతల మధ్య చర్చల సమయంలో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుందనే నమ్మకం తనకుందని రాహుల్ గాంధీ చెప్పారు. అయితే గెలిచిన తర్వాత కాంగ్రెస్, యూడీఎఫ్ ఏమి చేయబోతున్నాయన్నదే అసలైన ప్రశ్న అని ఆయన వ్యాఖ్యానించారు. కేరళలో తీవ్రమైన నిరుద్యోగ సమస్య ఉందని, దానికి కాంగ్రెస్, యూడీఎఫ్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఏ ప్రభుత్వం అయినా విజయవంతం కావాలంటే ప్రజలకు దగ్గరగా ఉండాలని, ప్రజలతో కలిసిపోవాలని ఆయన చెప్పారు.
కాంగ్రెస్–యూడీఎఫ్ నాయకత్వం వినయంగా ఉండి ప్రజలతో అనుసంధానమై ఉంటుందనే విశ్వాసం తనకు ఉందన్నారు.
ప్రస్తుత దశను సిద్ధాంతపరమైన, రాజకీయ పోరాటంగా పేర్కొన్న ఆయన, కేరళ నుంచి ఎంపీగా పనిచేసిన అవకాశం తనకు గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. కేరళ చరిత్ర, సంప్రదాయాలు, భాష, రాజకీయ లోతు, ముఖ్యంగా వైవిధ్యాల మధ్య ఐక్యతను కాపాడే సామర్థ్యం నుంచి తాను చాలా నేర్చుకున్నానని అన్నారు. నిరుద్యోగం కారణంగా వేలాది మంది కేరళ వాసులు విదేశాలకు వెళ్లడాన్ని చూసి బాధ కలుగుతుందని, అయితే ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న కేరళ నర్సులు సహా ఇతర వృత్తిపరులపై గర్వంగా ఉందని తెలిపారు. వాళ్లు విదేశాల్లో చేస్తున్న పనులను ఇక్కడే చేసే అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.
తన సోదరి ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న నిర్ణయాన్ని గుర్తు చేస్తూ, అది భావోద్వేగ నిర్ణయమని తాను చెప్పానని, కానీ ఆమె ఇప్పుడు కేరళ సమాజం, రాజకీయ సంస్కృతి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుందని అన్నారు. కేరళ సహజ సౌందర్యం, సాంస్కృతిక వైవిధ్యం, మత సామరస్యం, బలమైన రాజకీయ సంస్కృతిని ప్రశంసించిన రాహుల్ గాంధీ, ఇక్కడి ప్రజాస్వామ్య ప్రక్రియల నుంచే పునాది స్థాయి నాయకత్వం ఉద్భవిస్తుందని చెప్పారు. కేరళలో ఉన్నట్లుగా పంచాయతీ అధ్యక్షులు మరెక్కడా లేరని నా అభిప్రాయం అని అన్నారు.ప్రజలు నాయకులపై ఉంచే విశ్వాసమే అత్యంత ముఖ్యమని, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ఎంత ముఖ్యమో ప్రజలు గ్రహించాలన్నారు. కేరళ నిశ్శబ్ద సంస్కృతిని ఎప్పటికీ అంగీకరించదు. మీరు మౌనంగా ఉండనివ్వరని ఆయన అన్నారు.
ఎంఎన్ రేగాను ప్రధాని ఎగతాళి చేశారు
కార్యక్రమంలో పాల్గొన్న కొంతమంది అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం దేశంలోని అత్యంత పేదలకు కనీస వేతనం అందించాలనే ఉద్దేశంతో రూపొందించిందని చెప్పారు. ఈ పథకం కోట్లాది మంది జీవితం మార్చింది. కానీ ఇప్పుడు దాన్ని ధ్వంసం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనం చెల్లించాలనుకోవడం లేదు. అందుకే ఎంజీఎన్ఆర్ఈజీఏపై దాడి చేస్తోందని ఆరోపించారు. ఈ పథకం మూడో స్థాయి పాలనలో పనిచేయడమే మరో కారణమని ఆయన అన్నారు. వాళ్లు మూడో సారి పాలనకు ఆర్థిక అధికారాలు, నిర్ణయాధికారాలు ఇవ్వాలనుకోవడం లేదు. ఢిల్లీ నుంచి, కార్యాలయాల నుంచే పాలన నడపాలనుకుంటున్నారని విమర్శించారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ పేదల ప్రయోజనాలను కాపాడటంతో పాటు స్థానిక ఆయా ప్రభుత్వాలను బలోపేతం చేయడానికే రూపొందించిందని చెప్పారు. అందుకే ఈ పథకంపై దాడి చేస్తున్నారు. ప్రధాని స్వయంగా లోక్సభలో ఈ పథకాన్ని ఎగతాళి చేశారు. కానీ కోవిడ్ సమయంలో ఇదే పథకం మన ప్రజలను రక్షించిందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
