
అజంతా గుహలు ప్రపంచ వారసత్వం.. వాటిని సంరక్షించాలి: కెన్నెత్
అజంతా గుహలు మన ప్రపంచ వారసత్వ సంపద. దీన్ని తరతరాల పాటు కాపాడి సంరక్షించాల్సిన అవసరం ఉందని, 19వ శతాబ్దంలో అజంతా గుహలను చిత్రాల రూపంలో ప్రపంచానికి పరిచయం చేసిన మేజర్ రాబర్ట్ గిల్ వంశస్తుడు కెన్నెత్ డుకాటెల్ పేర్కొన్నారు. బ్రిటిష్ ఆర్మీలో పనిచేసిన రాబర్ట్ గిల్‌ను 1845లో రాయల్ ఏషియాటిక్ సొసైటీ అజంతా బౌద్ధ గుహా చిత్రాలను పిక్టోరియల్ రికార్డ్ రూపంలో నమోదు చేయడానికి నియమించింది. గిల్ ఆ పని కోసం ఏండ్ల తరబడి అజంతా ప్రాంతంలోనే నివసించగా, ఆయనకు సంబంధించిన నాలుగు పెయింటింగ్స్ లండన్‌లోని విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంలో ఇప్పటికీ సురక్షితంగా ఉన్నాయి. ఇటీవలి కాలంలో భార్య కేథరీనాతో కలిసి మూడు వారాల భారత పర్యటనలో భాగంగా ఛత్రపతి శంభాజీనగర్‌కి వచ్చిన కెన్నెత్, మంగళవారం అజంతా గుహలను సందర్శించారు. బుధవారం ఎల్లోరా, బీబీకా మక్బరా, దేవగిరి (దౌలతాబాద్) కోటలలో పర్యటించారు.
మీరు చూపుతున్న ఆదరణ మరవలేనిది
ఈ మహత్తర ప్రపంచ సంపదను కాపాడడం గొప్ప బాధ్యత. మీరు చూపుతున్న ఆదరణ, నైపుణ్యం అభినందనీయం. ఈ వారసత్వాన్ని తరతరాల పాటు సంరక్షించాలని అజంతా గుహల గెస్ట్‌బుక్‌లో కెన్నెత్ రాశారు.మా కుటుంబానికి భారతదేశంతో ఉన్న అనుబంధం గురించి చిన్ననాటి నుంచే తెలుసు. తర్వాత రాబర్ట్ గిల్ చేసిన పనిపై అధ్యయనం చేశాను. ఇక్కడ ప్రజలు ఇచ్చిన ఆత్మీయ స్వాగతం మరువలేనిది అన్నారు. బెల్జియంలో ప్రభుత్వ ఉద్యోగం నుంచి కెన్నెత్ రిటైర్ అయ్యారు.
ఇక్కడి ప్రజలపై ఆయనకు అపారమైన ప్రేమ
రాబర్ట్ గిల్‌కు సహాయంగా పనిచేసిన పారో అనే మహిళ సమాధిని కూడా సందర్శించినట్లు ఆయన తెలిపారు. రంగులు తయారు చేయడంలో పారో ఎంతో సహకరించినట్టు తెలుసుకున్నాను. ఆమె కనిపించని అత్యంత ముఖ్యమైన భాగస్వామి అని పేర్కొన్నారు. అజంతా వంటి దూర ప్రాంతంలో అంత కాలం గిల్ ఎలా జీవించగలిగారని ఆశ్చర్యపడ్డానని అన్నారు. ఆయనకు భారతదేశంపై, ఇక్కడి ప్రజలపై అపారమైన ప్రేమ ఉండాలి. అజంతా మళ్లీ మళ్లీ సందర్శించదగిన ప్రదేశం. నా కుటుంబ సభ్యులందరినీ ఇక్కడికి తీసుకువస్తాను అని చెప్పారు.
ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఇతర స్మారక కట్టడాలు కూడా ప్రపంచవ్యాప్తంగా మరింత ఖ్యాతి పొందాలని కెన్నెత్ ఆకాంక్షించారు. అజంతా గుహలు 1819లో మళ్లీ కనుగొన్న తర్వాత, బౌద్ధ గుహా చిత్రాలను విస్తృతంగా ప్రతులు చేసిన తొలి చిత్రకారుడు రాబర్ట్ గిల్ అని రాయల్ ఏషియాటిక్ సొసైటీ సమాచారం. కాలక్రమేణా అసలు చిత్రాలు దెబ్బతిన్న నేపథ్యంలో, గిల్ గీసిన ప్రతులు అజంతా అధ్యయనాలకు కీలక ఆధారాలుగా నిలిచాయి.
