Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
అక్రమ పశువుల రవాణా అరికట్టేందుకు డిజిటల్ ట్రాన్స్‌పోర్ట్ సర్టిఫికెట్ విధానం : అచ్చెన్నాయుడు

అక్రమ పశువుల రవాణా అరికట్టేందుకు డిజిటల్ ట్రాన్స్‌పోర్ట్ సర్టిఫికెట్ విధానం : అచ్చెన్నాయుడు

Panthagani Anusha
6 మార్చి, 2026

రాష్ట్రంలో పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పశువులను ఒక చోటు నుంచి మరో చోటుకు వాహనాల్లో తరలించాలంటే కచ్చితంగా ఆన్‌లైన్ అనుమతి ఉండాల్సిందే. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన 'డిజిటల్ ట్రాన్స్‌పోర్ట్ సర్టిఫికెట్' విధానాన్ని పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం విజయవాడలో ప్రారంభించారు. ఈ కొత్త విధానం ద్వారా పశువుల విక్రయాలు, రవాణాలో పారదర్శకత పెరగడమే కాకుండా అక్రమాలకు చెక్ పడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

అనుమతి ఉంటేనే రవాణా

ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఇకపై పశువులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రవాణా చేయాలనుకునే వారు తప్పనిసరిగా డిజిటల్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. "పశువుల రవాణా చేయదలిచిన ప్రతి వ్యక్తి సంబంధిత పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఆన్‌లైన్ ద్వారా ఈ డిజిటల్ సర్టిఫికెట్ పొందాలి. పశువుల సంఖ్య, గమ్యస్థానం, రవాణా చేసే వాహనం వంటి వివరాలను నిబంధనల మేరకు పరిశీలించిన తర్వాతే అధికారులు ఈ అనుమతి పత్రాన్ని జారీ చేస్తారు" అని ఆయన స్పష్టం చేశారు.

పోలీస్, రవాణా శాఖల నిఘా

రవాణా సమయంలో తనిఖీలు నిర్వహించే పోలీస్, రవాణా శాఖ అధికారులు ఈ డిజిటల్ సర్టిఫికెట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తారని మంత్రి తెలిపారు. చెల్లుబాటు అయ్యే క్యూఆర్ కోడ్ లేదా డిజిటల్ ధృవీకరణ పత్రం ఉంటేనే వాహనాలను అనుమతించాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల బాధ్యతారాహిత్యంగా పశువులను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం సులభతరమవుతుందని పేర్కొన్నారు. ఈ నూతన వ్యవస్థ పశుసంవర్ధక రంగంలో జవాబుదారీతనాన్ని పెంచుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కాగా ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడుతో పాటు పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అక్రమ పశువుల రవాణా అరికట్టేందుకు డిజిటల్ ట్రాన్స్‌పోర్ట్ సర్టిఫికెట్ విధానం : అచ్చెన్నాయుడు - Tholi Paluku