
అక్టోబర్ 2 నాటికి లెగసీ వేస్ట్ తొలగించాలి: మంత్రి నారాయణ
గత ప్రభుత్వం వదిలివెళ్లిన సుమారు 150 లక్షల టన్నుల లెగసీ వేస్ట్‌ను పూర్తిగా తొలగిస్తున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. భూమిపై ఉన్న చెత్తను ఇప్పటికే పూర్తిగా తొలగించామని, భూమిలోపల ఉన్న వ్యర్థాలను కూడా అక్టోబర్ 2 నాటికి పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించినట్లు శుక్రవారం చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆరు వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్ల ద్వారా రోజువారీగా ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్‌గా మార్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అప్పటి వరకు ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, వాటి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. అక్టోబర్ 2 నుంచి మొత్తం చెత్తను ప్లాంట్లకు తరలించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రాన్ని డంపింగ్ యార్డులు లేని మున్సిపాలిటీలుగా మార్చడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
అమరావతిలో రూ.1,437 కోట్లతో మౌలిక వసతులు
రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రూ.1,437 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధికి సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 65వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వెల్లడించారు. శాఖమూరులో రూ.596 కోట్లతో సెంట్రలైజ్డ్ పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం, హ్యూమన్ రిసోర్స్ భవనాల నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. రాజధాని గ్రామాల్లో రహదారులు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి పైపులైన్లు, వీధి దీపాల ఏర్పాటుకు రూ.1,437 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. గతంలో మంజూరైన రూ.904 కోట్లతో కలిపి మొత్తం రూ.1,437 కోట్లతో 29 గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన పూర్తవుతుందన్నారు.
ఇక రోజుకు 135 లీటర్ల నీరు
రాజధాని గ్రామాల్లో ప్రస్తుతం ఒక్కొక్కరికి రోజుకు 40 లీటర్ల నీరు మాత్రమే అందుతోందని, ఇకపై ప్రతి వ్యక్తికి రోజుకు 135 లీటర్ల తాగునీరు అందించేలా పైపులైన్లను మార్చేందుకు సీఆర్డీఏ ఆమోదం తెలిపిందన్నారు. మంగళగిరి పట్టణానికి రోజుకు 30 ఎంఎల్డీ నీటిని సరఫరా చేసేందుకు అనుమతి లభించిందని, భవిష్యత్‌లో అక్కడ 80 ఎంఎల్డీ నీటి అవసరం ఉంటుందని చెప్పారు.
రాజధాని గ్రామాల్లో బీటీ రోడ్లు
రాజధాని గ్రామాల్లో 54 అడుగుల కంటే తక్కువ వెడల్పు ఉన్న రహదారులను సీసీ రోడ్లుగా కాకుండా బీటీ రోడ్లుగా నిర్మించాలని నిపుణులు సూచించారని, సీఆర్ఆర్ఐ న్యూఢిల్లీ, ఐఐటీ ఖరగ్‌పూర్ సంస్థల సూచనల మేరకు బీటీ రోడ్ల నిర్మాణానికి సీఆర్డీఏ అంగీకరించిందన్నారు. ట్రంక్ రోడ్లకు ల్యాండ్ టు ల్యాండ్ నిర్మాణం కోసం అదనంగా రూ.533 కోట్లకు ఆమోదం లభించిందని చెప్పారు.
42 ఎకరాల్లో మిక్స్డ్ యూజ్ అభివృద్ధి
మిక్స్డ్ యూజ్ కింద ప్రైవేటు సంస్థలకు భూములు కేటాయించేందుకు మొత్తం 42 ఎకరాలను సీఆర్డీఏ గుర్తించిందని నారాయణ తెలిపారు. పిచ్చికలపాలెంలో 7.9 ఎకరాలు, తుళ్లూరులో 5 ఎకరాలు, మందడంలో 12.38, 6 ఎకరాలు, కూరగల్లులో 6 ఎకరాలు ఉన్నాయని చెప్పారు.
రాజధాని ప్రాంతంలో కేటాయించిన భూమి కంటే అదనంగా భూమి కోరే పాఠశాలలు, హోటళ్ల వంటి సంస్థలకు ఎకరాకు రూ.4.1 కోట్ల ప్రాథమిక విలువకు 250 శాతం అదనంగా అంటే సుమారు రూ.10.25 కోట్ల చొప్పున భూమి ఇచ్చేందుకు అనుమతి లభించిందన్నారు. అమరావతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డీమ్డ్ యూనివర్సిటీ నిర్మాణానికి 8.5 ఎకరాలు కేటాయించేందుకు సీఆర్డీఏ అనుమతించిందని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్లు కంతేరు, తాడికొండ ప్రాంతాల మీదుగా వెళ్లనున్న నేపథ్యంలో వాటి నుంచి రాజధాని వరకు ఉన్న భూములను ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి తీసుకునేందుకు సీఆర్డీఏ ఆమోదం తెలిపిందన్నారు. కొత్తగా ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చే రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. 2026 జనవరి 6కు ముందు తీసుకున్న వ్యవసాయ రుణాలకు గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు రుణమాఫీ వర్తిస్తుందని తెలిపారు.
