Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
అంబర్‌పేట సర్వీస్ రోడ్డు పనులపై సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ

అంబర్‌పేట సర్వీస్ రోడ్డు పనులపై సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ

Gaddamidi Naveen
6 మార్చి, 2026

అంబర్‌పేట ఫ్లైఓవర్ కింద పెండింగ్‌లో ఉన్న సర్వీస్ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర బొగ్గు గనుల‌ శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు.

అంబర్‌పేట్ క్రాస్ రోడ్స్ వద్ద జాతీయ రహదారి‑163పై ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1.5 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లేన్ల ఫ్లైఓవర్‌ను నిర్మించారు. రూ.265 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ను 2025 మే 5న కేంద్ర రహదారి రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు.

అయితే ఫ్లైఓవర్ ప్రారంభమైనప్పటికీ, దాని కింద నిర్మించాల్సిన సర్వీస్ రోడ్ ఇంకా పూర్తికాలేదని కిషన్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. భూసేకరణ ప్రక్రియ పూర్తికాకపోవడం వల్ల ఈ పనులు నిలిచిపోయాయని తెలిపారు. ఈ కారణంగా అంబర్‌పేట్ ప్రాంతంలో ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు.

ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌తో చర్చించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా పలుమార్లు అభ్యర్థించినప్పటికీ భూసేక‌ర‌ణ‌ ప్రక్రియ ఇంకా నిలిచిపోయిందని చెప్పారు.

అంబర్‌పేట్ మార్గం నగరంలోని ముఖ్య రవాణా మార్గాల్లో ఒకటని, రోజూ భారీగా వాహనాలు ప్రయాణిస్తాయని ఆయన పేర్కొన్నారు. అందువల్ల పెండింగ్‌లో ఉన్న భూసేక‌ర‌ణ‌ సమస్యలను త్వరగా పరిష్కరించి, ఫ్లైఓవర్ కింద సర్వీస్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కిషన్ రెడ్డి కోరారు.

అంబర్‌పేట సర్వీస్ రోడ్డు పనులపై సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ - Tholi Paluku