Let's talk: editor@tmv.in
అంబర్‌పేట మహంకాళి బోనాల ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయండి: వీహెచ్

అంబర్‌పేట మహంకాళి బోనాల ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయండి: వీహెచ్

Gaddamidi Naveen
30 జులై, 2026

అంబర్‌పేట్ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు ఆదేశించారు. ఆగస్టు 9న అంబర్‌పేట్ మహంకాళి ఆలయంలో అమ్మవారి బోనాలు జరగనున్న నేపథ్యంలో, బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

జీహెచ్‌ఎంసీ, ట్రాన్స్‌కో, పోలీస్, జలమండలి, వైద్యారోగ్య, సాంస్కృతిక శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ బోనాల ఉత్సవాలు ఈ ఏడాది జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు జరుగుతాయని వీహెచ్ పేర్కొన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని ఆలయాల్లో నిర్వహించే బోనాల ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పనిచేయాలని కోరారు.

ఘటోత్సవాలు, బోనాల సమర్పణ, సాక, తొట్టెల ఊరేగింపులు, పోతురాజుల విన్యాసాలు, రంగం, గావుపట్టడం, సాగనంపు వంటి సంప్రదాయ కార్యక్రమాలు తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకలని పేర్కొన్నారు. భక్తులకు తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు, క్యూలైన్లు, సీసీ కెమెరాలు, వైద్య శిబిరాలు వంటి అన్ని సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. భారీ రద్దీ ఉండే ఆలయాల వద్ద ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికలు, అదనపు ఆర్టీసీ బస్సులు, వైద్య బృందాలు, భద్రతా ఏర్పాట్లు, వృద్ధుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. బోనాల ఉత్సవాలకు, దేవాదాయశాఖ అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్‌లు
Bonalu2026AmberpetBonaluMahankaliHyderabadTelanganaFestivalOfTelanganaTempleFestivalDevotionalSpiritualIndiaRevanthReddy
అంబర్‌పేట మహంకాళి బోనాల ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయండి: వీహెచ్ - Tholi Paluku