Let's talk: editor@tmv.in
అందరికీ అందుబాటులో ఉండే సమగ్ర రాజధానిగా అమరావతి: సీఎం చంద్రబాబు

అందరికీ అందుబాటులో ఉండే సమగ్ర రాజధానిగా అమరావతి: సీఎం చంద్రబాబు

Gaddamidi Naveen
16 జులై, 2026

ఆంధ్రప్రదేశ్ గ్రీన్‌ఫీల్డ్ రాజధాని అమరావతిని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు వచ్చి నివసిస్తూ, ఉపాధి అవకాశాలు పొందే సమగ్ర నగరంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భవిష్యత్‌లో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అమరావతి ప్రధాన చోదకశక్తిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.

అమరావతి 2.0 ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ పురోగతిపై సీనియర్ అధికారులతో పాటు సింగపూర్ ప్రతినిధుల బృందంతో బుధవారం సమీక్ష నిర్వహించిన సీఎం, రాజధాని అభివృద్ధి ప్రణాళికలో సమగ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి చెందిన ప్రజలు ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ, నివసించేలా మౌలిక సదుపాయాలు, ఆర్థిక అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నగరంగా తీర్చిదిద్దుతున్నామని, ఇందుకోసం సమగ్ర రహదారి వ్యవస్థను రూపొందిస్తున్నామని తెలిపారు. నగర అభివృద్ధిలో భాగంగా అంతర్గత, రింగ్ రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో సింగపూర్ ప్రతినిధుల బృందం అమరావతి 2.0 ప్రాజెక్టు పరిధి, అమలు వ్యూహం, కార్యాచరణ ప్రణాళికను ముఖ్యమంత్రికి వివరించింది. ప్రాంతీయ అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రణాళిక, పెట్టుబడుల నమూనాలు వంటి అంశాలు ప్రణాళికలో భాగంగా ఉన్నాయని వారు తెలిపారు.

అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగా కాకుండా, బలమైన ఆర్థిక పునాదులతో కూడిన సృజనాత్మక నగరంగా ఎదగాలని సీఎం పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణల ఆధారంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే దిశగా రాజధాని అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు.

పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ బిల్డింగ్ విధానాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర జల వనరులను ప్రస్తావిస్తూ పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లించడం వల్ల ఎల్‌నినో వంటి పరిస్థితుల్లోనూ నీటి భద్రత సాధ్యమైందన్నారు. దీంతో అమరావతి ప్రాంతం జల వనరుల పరంగా మరింత సురక్షితంగా, అభివృద్ధికి అనుకూలంగా మారిందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

ట్యాగ్‌లు
AmaravatiAmaravatiCapitalAndhraPradeshCMChandrababuNaiduCapitalCityAmaravati2_0InclusiveGrowthWorldClassCityAPDevelopmentSmartCity