
గుణదల నీటి సమస్యలపై వైఎస్సార్సీపీ వినూత్న నిరసన
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుణదల కొండ ప్రాంత ప్రజలకు దక్కాల్సిన తాగునీటిని సెంట్రల్ నియోజకవర్గంలోని గద్దెవారి పొలాల పరిధిలోని అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ భవనాల కోసం అక్రమంగా తరలించేందుకు కూటమి నాయకులు, స్థానిక ఎమ్మెల్యే యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
దీనికి నిరసనగా గంగిరెద్దుల దిబ్బ, విజయనగర్ కాలనీ, క్రీస్తురాజపురం ప్రాంత ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి అవినాష్ నీళ్ల గుంతలోకి దిగి సుదీర్ఘంగా వినూత్న ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వైఎస్సార్సీపీ పాలనలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడి తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించామని గుర్తుచేశారు. కానీ నేడు ప్రజలు నీరు లేక అల్లాడుతుంటే స్థానిక ఎమ్మెల్యే కేవలం షో రాజకీయాలు, కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న ప్రజలపై పోలీసులను కాపలా పెట్టి ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అమలు చేస్తూ బెదిరింపులకు దిగడం దారుణమన్నారు.
వైఎస్సార్సీపీ చేపట్టిన ఈ ఉధృత పోరాటంతో ఎట్టకేలకు అధికారులు దిగివచ్చారు. గుణదల కొండ ప్రాంత ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని, నీటి తరలింపును అడ్డుకుంటామని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్‌ఈ ద్వారా రాతపూర్వక హామీ పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా దేవినేని అవినాష్ అధికారులను హెచ్చరిస్తూ.. రాతపూర్వక హామీ ప్రకారం నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకూడదని, భవిష్యత్తులో ఏ చిన్న సమస్య వచ్చినా నేరుగా మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందే భారీ ధర్నా చేపడతామని స్పష్టం చేశారు. ఈ విజయం కొండ ప్రాంత ప్రజలదేనని ఆయన ప్రకటించారు.
