Let's talk: editor@tmv.in
జీడీ నెల్లూరులో మామిడి రైతులకు మద్దతుగా వైయస్‌ఆర్సీపీ ఆందోళన
జీడీ నెల్లూరులో మామిడి రైతులకు మద్దతుగా వైయస్‌ఆర్సీపీ ఆందోళన

జీడీ నెల్లూరులో మామిడి రైతులకు మద్దతుగా వైయస్‌ఆర్సీపీ ఆందోళన

Gaddamidi Naveen
1 జులై, 2026

మామిడి రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండల కేంద్రంలో వైయస్‌ఆర్సీపీ నేతలు, రైతులతో కలిసి భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల వైయస్‌ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి, మాజీ మంత్రి నారాయణస్వామి, జీడీ నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి, చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ విజయానందరెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప, చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు వల్లివేడు పృథ్విరెడ్డి, పూతలపట్టు సమన్వయకర్త సునీల్‌కుమార్ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.

వైయస్‌ఆర్సీపీ నేతలు శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకుని పలువురు నేతలను అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై వైయస్‌ఆర్సీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చిత్తూరు, జీడీ నెల్లూరు, పూతలపట్టు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు నిరసనకు హాజరై, మామిడి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ, మామిడి రైతులకు కనీస మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతులకు కిలోకు రూ.17 మద్దతు ధర వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోనే మామిడి రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

పక్క రాష్ట్రం కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వం లక్షా 30 వేల టన్నుల తోతపూరి మామిడిని కిలో రూ.17.50 చొప్పున కొనుగోలు చేసేందుకు అంగీకరించిందని గుర్తు చేశారు. గత జగన్‌ ప్రభుత్వ హయాంలో తోతపూరి మామిడి ధర రూ.25 కంటే తక్కువకు పడిపోలేదని పేర్కొన్నారు. మామిడి రైతులకు కేంద్రం ద్వారా కిలోకు రూ.17.50 మద్దతు ధర వచ్చేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని భూమన స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ద్రాక్షాయణి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
MangoFarmersMangoFarmersProtestSupportFarmersYSRCPGDNelloreChittoorAndhraPradeshMinimumSupportPrice