Let's talk: editor@tmv.in
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ భారీ నిరసనలు
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ భారీ నిరసనలు
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ భారీ నిరసనలు

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ భారీ నిరసనలు

Gaddamidi Naveen
13 జూన్, 2026

రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తైన సందర్భంగా ‘‘వెన్నుపోటుకు రెండేళ్లు’’ పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలు చేపట్టింది.

పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ జయమ్మ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీని ప్రారంభించగా, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని నేతలు విమర్శించారు. తిరుపతిలో జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, యువనేత భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో వేలాది మంది కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. గ్రూప్ థియేటర్ సర్కిల్ నుంచి తుడా వైఎస్ఆర్ సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీలో మహిళలు, రైతులు, యువతకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోలేదని నాయకులు ఆరోపించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు విమర్శించారు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. గుంటూరులో మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రెండేళ్లుగా హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. కావలి, అరకులోయ తదితర ప్రాంతాల్లో కూడా నిరసనలు జోరుగా సాగాయి. అరకులోయలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం నేతృత్వంలో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. డీఎస్సీ నియామకాలలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అనంతపురంలో లలిత కళా పరిషత్ నుంచి టవర్ క్లాక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిరసన వ్యక్తం చేశారు. టవర్ క్లాక్ వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి తమ ఆందోళనను తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.