Let's talk: editor@tmv.in
సాయికృష్ణ, క్రాంతికుమార్ ఘటనలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు

సాయికృష్ణ, క్రాంతికుమార్ ఘటనలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు

Gaddamidi Naveen
20 జూన్, 2026

విజయవాడలో చోటుచేసుకున్న గాడె సాయికృష్ణ అనుమానాస్పద మృతి, పి. క్రాంతికుమార్ ఆత్మహత్య ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తక్షణ జోక్యం చేసుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు మద్దిల గురుమూర్తి, గుమ్మా తనూజారాణి కోరారు. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ రామసుబ్రహ్మణ్యంను కలిసి రెండు ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.

సాయికృష్ణ మృతి ఘటనలో మానవ హక్కుల ఉల్లంఘనలు, పోలీసు అధికార దుర్వినియోగం, కస్టడీ హింసకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని ఎంపీలు కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత జరిగిన పరిణామాలు అనుమానాస్పదంగా ఉన్నాయని, కుటుంబ సభ్యులు కస్టడీలో హింస, శారీరక వేధింపులు, ఆచూకీపై సమాచారం ఇవ్వలేదని ఆరోపిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై స్వతంత్ర, నిష్పాక్షిక, కాలపరిమితి గల విచారణ జరిపించాలని కోరారు.

క్రాంతికుమార్ ఆత్మహత్య ఘటనలో కూడా పోలీసుల వేధింపులే కారణమన్న ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. మరణానికి ముందు రికార్డు చేసినట్లు చెబుతున్న వీడియోలో కృష్ణలంక సీఐ నాగరాజుపై నిరంతర వేధింపులు, మానసిక చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వైరల్‌ వీడియోతో పాటు మొబైల్‌ ఫోన్‌ రికార్డులు, ఇతర డిజిటల్‌ ఆధారాలను భద్రపరచి ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహించాలని కోరారు. రెండు ఘటనల్లోనూ ఒకే పోలీసు అధికారిపై ఆరోపణలు రావడం ఆందోళనకరమని పేర్కొన్న ఎంపీలు, అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో విచారణ జరిపేలా ఎన్‌హెచ్‌ఆర్‌సీ సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేశారు.