
రాష్ట్రంలో నేర రాజకీయాలకు నాంది పలికింది వైఎస్సార్ కుటుంబమే:మంత్రి పయ్యావుల కేశవ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హింసా సంస్కృతికి నాంది పలికి, రాష్ట్రాన్ని నేరమయం చేసింది వైఎస్సార్ కుటుంబమేనని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. విజయవాడలో నిర్వహించిన ఒక పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం దశాబ్దాలుగా సాగిన ఫ్యాక్షన్ రాజకీయాల వెనుక ఉన్న అసలు శక్తులను మంత్రి ఈ సందర్భంగా ఎండగట్టారు.
రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించింది వైఎస్సార్ కుటుంబమేనని పయ్యావుల కేశవ్ విమర్శించారు. ముఖ్యంగా పులివెందుల సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రాజకీయ విభేదాల పేరుతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. గతంలో ప్రత్యర్థుల ఇళ్లపై డైనమైట్లతో దాడులు జరిగిన భీకర సంఘటనలను రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ మరచిపోలేదని ఆయన గుర్తు చేశారు. రాజారెడ్డి హత్యా రాజకీయాల గురించి పులివెందుల నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా తెలుసని రాజకీయాల్లో హింసకు కొత్త రూపం ఇచ్చింది వైఎస్ కుటుంబమేనని మంత్రి దుయ్యబట్టారు.
ఇదే క్రమంలో మాజీ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావించిన మంత్రి పయ్యావుల, ఈ కేసులో జగన్ మోహన్ రెడ్డి పాత్రపై రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉందని ఈ దారుణ ఉదంతంలో సానుభూతి కోసం ప్రయత్నిస్తున్న జగన్ మోహన్ రెడ్డి బాధితుడు కాదని ఆయనే అసలైన నిందితుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలోనే కాకుండా ప్రస్తుతం కూడా రాష్ట్రంలో నేర రాజకీయాలను అరాచకాలను జగన్ మోహన్ రెడ్డి నిరంతరం ప్రోత్సహిస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
