
నేడు విశాఖకు వైఎస్ జగన్
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలను, గాయపడిన బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పరామర్శించనున్నారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు మరణించడం, పలువురు తీవ్రంగా గాయపడటంపై జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆయన పార్టీ సీనియర్ నాయకులతో మాట్లాడుతూ అక్కడి పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్నారు. బాధితులకు తక్షణ సహాయం అందించాలని, గాయపడిన కార్మికులకు అత్యంత మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఆయన ఇప్పటికే పార్టీ శ్రేణులను ఆదేశించారు. బుధవారం తన పర్యటనలో భాగంగా జగన్ స్వయంగా ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించి, వారికి నైతిక మద్దతు ఇవ్వనున్నారు.
సోమవారం విశాఖ స్టీల్ ప్లాంట్ లోని ఎస్‌ఎమ్ఎస్-2, ఎస్‌టీసీ-3 హీట్ ఫెసిలిటీ విభాగాల నుంచి భారీగా ద్రవరూప ఉక్కు లీక్ కావడంతో ఎనిమిది మంది కార్మికులు మరణించగా, పలువురు గాయపడిన సంగతి తెలిసిందే.
