
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: మంత్రి శ్రీధర్ బాబు
మాదకద్రవ్యాల (డ్రగ్స్) వినియోగం, అక్రమ విక్రయాలపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. యువత డ్రగ్స్, పొగాకు వంటి వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఆరోగ్యకరమైన అలవాట్లతో ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని ఆయన కోరారు.
అదివారం రాయదుర్గంలోని సత్త్వ నాలెడ్జ్ పార్క్‌లో గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'నోటి క్యాన్సర్ మారథాన్'లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10కే రన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత చదువుతో పాటు యోగా, వ్యాయామం వంటి శారీరక దృఢత్వాన్ని ఇచ్చే అలవాట్లను జీవనశైలిలో భాగం చేసుకోవాలని సూచించారు.
సమాజంలో చెడు అలవాట్ల వల్ల ప్రాణనష్టం పెరుగుతుండటంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. గుట్కా, పొగాకు వంటి హానికర పదార్థాల వినియోగం ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు అని హెచ్చరించారు. ముఖ్యంగా పొగాకు వినియోగం వల్ల నోటి క్యాన్సర్ సహా అనేక ప్రమాదకర వ్యాధులు పెరుగుతున్నాయని తెలిపారు. అందువల్ల ఇలాంటి అలవాట్లను పూర్తిగా విడిచిపెట్టాలని ప్రజలను కోరారు. వీటిపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించేందుకు మరిన్ని చైతన్య కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ 5కే రన్‌ను ప్రారంభించగా, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు 2కే రన్‌ను ప్రారంభించారు. గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కె. దిలీప్ కుమార్, అలాగే డాక్టర్ నాగ దీపిక, డాక్టర్ సౌమ్య, డాక్టర్ వినూత్న,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మారథాన్ ద్వారా నోటి క్యాన్సర్‌పై అవగాహన పెంచడం, ఆరోగ్యకర జీవనశైలిపై ప్రజలను చైతన్యపరచడం లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు. సమాజం మొత్తం కలిసి చెడు అలవాట్లకు వ్యతిరేకంగా పోరాడితేనే ఆరోగ్యవంతమైన భవిష్యత్తును నిర్మించవచ్చని కార్యక్రమంలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.
