
యువత ‘బ్లూ’ కాలర్ ఉద్యోగాలపై దృష్టి సారించాలి: సీఎం రేవంత్ రెడ్డి
మారుతున్న ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా యువత ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కారణంగా వైట్ కాలర్ ఉద్యోగాలు కోల్పోతున్నామని ఆందోళన చెందకుండా, దానికి ప్రత్యామ్నాయంగా ఉన్న బ్లూ కాలర్ ఉద్యోగాలపై యువతరం దృష్టి పెట్టాలని, అందుకు తగిన నైపుణ్యాలు (స్కిల్స్) పెంచుకోవాలని ఆయన సూచించారు. బెంగళూరులో 'ది హిందూ' దినపత్రిక నిర్వహించిన ‘ది హిందూ హడిల్-2026’ చర్చాగోష్ఠిలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు, రాజకీయ, సామాజిక, వ్యక్తిగత అంశాలకు సంబంధించిన పలు ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానాలు ఇచ్చారు.
ఏఐ సవాళ్లను ఎదుర్కొనేందుకు యువతలో నైపుణ్యాలు పెంపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేసిందని, అలాగే పాత సిలబస్‌తో ఉన్న ఐటీఐలను అత్యాధునిక టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ)గా అప్‌గ్రేడ్ చేసిందని సీఎం వివరించారు. నిరుద్యోగ యువత ప్రయోజనాలే ధ్యేయంగా టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి, కేవలం 15 నెలల కాలంలోనే 67,760 ఉద్యోగాలను విజయవంతంగా భర్తీ చేశామని వెల్లడించారు. ఇది దేశంలోనే అత్యధికమని, త్వరలోనే మరో 5 వేల పోలీస్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు.
రైతుల అప్పులను తీర్చి వారి ఆత్మహత్యలను నివారించడమే లక్ష్యంగా, అధికారంలోకి వచ్చిన వెంటనే 25,035 రైతు కుటుంబాలకు చెందిన రూ. 20,616 కోట్ల రుణాలను మాఫీ చేశామని సీఎం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం 2024-25 సంవత్సరానికి గాను 'రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రం'గా తెలంగాణ నిలిచిందని ఆయన ప్రకటించారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ. 12 వేల పెట్టుబడి సాయం అందిస్తూనే, దేశంలోనే తొలిసారిగా ధాన్యం రైతులకు మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు.
మహిళా సాధికారతకు పెద్దపీట
తెలంగాణలోని స్వయం సహాయక సంఘాల మహిళల అభ్యున్నతి కోసం సున్నా వడ్డీతో 67 లక్షల మంది మహిళలకు రూ. 60,000 కోట్ల రుణాలను అందిస్తున్నామని, ఆ వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సంఘాల మహిళలు 1,000 బస్సులు కొనుగోలు చేయడమే కాకుండా, పునరుత్పాదక ఇంధన రంగంలోకి అడుగుపెట్టి పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు నిర్వహిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల వసతుల కల్పన బాధ్యతలను కూడా విజయవంతంగా చూసుకుంటున్నారని ప్రశంసించారు.
తెలంగాణ సమగ్రాభివృద్ధి
రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగడానికి తెలంగాణ రైజింగ్ 2047 దార్శనికతతో ముందుకు వెళ్తున్నామని సీఎం వివరించారు. ఇందుకోసం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి క్యూర్, ప్యూర్, రేర్ నమూనాలతో ప్రాంతాల వారీగా ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో చెరువుల పునరుద్ధరణ, మెట్రో విస్తరణ, ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం వంటి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. భవిష్యత్ నగరంగా రూపుదిద్దుకుంటున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
తెలంగాణ పొరుగు రాష్ట్రాలతో కాకుండా చైనా, జపాన్, జర్మనీల పురోగతితో పోటీ పడుతోందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పరిపాలనలో నేర్చుకోవడానికి తనకెలాంటి అహంకారం లేదని, సమస్యల పరిష్కారాలను తెలుసుకోవడానికి త్వరలోనే చైనా పర్యటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 17 ఏళ్ల సుదీర్ఘ ప్రతిపక్ష అనుభవం, సామాన్య వ్యవసాయ కుటుంబ నేపథ్యమే తనను ప్రజలకు సేవ చేసే ప్రజాప్రతినిధిగా నిలబెట్టాయని సీఎం భావోద్వేగంగా ముగించారు.
