Let's talk: editor@tmv.in
‘మీ టికెట్’ - ఒకే యాప్‌లో అన్ని సేవలూ!

‘మీ టికెట్’ - ఒకే యాప్‌లో అన్ని సేవలూ!

Gaddamidi Naveen
25 ఏప్రిల్, 2026

వారాంతాల్లో కుటుంబంతో కలిసి మెట్రో ప్రయాణం చేయాలన్నా, గోల్కొండ కోట సందర్శించాలన్నా లేదా ప్రముఖ దేవాలయాలు, పార్కులకు వెళ్లాలన్నా ఇకపై టికెట్ కౌంటర్ల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. పౌరుల సౌకర్యార్థం మీసేవ ఆధ్వర్యంలో రూపొందించిన ‘మీ టికెట్’ యాప్ ఇప్పుడు అన్ని పర్యాటక, ప్రయాణ సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చింది.

ఈ యాప్ ద్వారా బస్సు, మెట్రో టికెట్లతో పాటు దేవాలయాలు, మ్యూజియంలు, పార్కులు, ఫారెస్ట్ సఫారీ ఎంట్రీ టికెట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలు కలిగిన వారు తమ సమీపంలో ఉన్న ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల వివరాలను కూడా తెలుసుకోవచ్చు. డిజిటల్ విప్లవంలో భాగంగా ఈ యాప్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు 2.5 లక్షలకుపైగా డౌన్‌లోడ్లు నమోదవగా, 6 లక్షలకుపైగా సేవలు బుక్ అయ్యాయి. రూ.4 కోట్లకు పైగా లావాదేవీలు పూర్తయ్యాయి. ప్రస్తుతం 219 ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పౌరులకు డిజిటల్ సేవలను మరింత సులభతరం చేసేందుకు త్వరలోనే మరిన్ని సేవలను ఈ యాప్‌లో చేర్చనున్నట్లు తెలిపారు. మీసేవ కమిషనర్ టి. రవికిరణ్, పౌరులందరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, క్యూ లైన్ల ఇబ్బంది లేకుండా ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.