
ప్రతిష్టాత్మకంగా జూన్ 21న యోగాంధ్ర@2026
రాష్ట్ర ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన "యోగాంధ్ర-2026" కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జూన్ 21న రానున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, జూన్ 7వ తేదీ నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ కార్యక్రమ ప్రణాళికను ఆమోదించారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు దాదాపు కోటి మందిని ఈ యోగా ఉద్యమంలో భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ కార్యాచరణను సిద్ధం చేసింది.
ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా జూన్ 21న రాజధాని అమరావతి సరికొత్త రికార్డుకు వేదిక కాబోతోంది. వెస్ట్ బైపాస్ రోడ్ నిర్మాణంలో భాగంగా కృష్ణా నదిపై నిర్మించిన ప్రతిష్టాత్మక బ్రిడ్జిపై 25 వేల మందితో బృహత్తర రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ చారిత్రాత్మక వేడుకలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొని ప్రజలతో కలిసి ఆసనాలు వేయనున్నారు. అదే రోజున అన్ని జిల్లా కేంద్రాల్లో కనీసం వెయ్యి మందితో ప్రత్యేక యోగా ఈవెంట్స్ జరగనున్నాయి. ఈ జిల్లాల కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు స్వయంగా పాల్గొని ప్రజలను ఉత్సాహపరచనున్నారు. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు రూ. 25 లక్షల చొప్పున నిధులను కూడా ప్రభుత్వం కేటాయించింది.
ఐదు శాఖల సమన్వయం - పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక సెషన్స్
ఈ భారీ కార్యక్రమాన్ని కేవలం ఒక విభాగానికే పరిమితం చేయకుండా ఆరోగ్య, మానవవనరులు, మునిసిపల్, పంచాయతీ రాజ్, దేవాదాయ, ఐటీ శాఖలను సమన్వయం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. 14 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో గల 56 ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో ప్రత్యేక యోగా సెషన్లు నిర్వహించనున్నారు. రోజుకు రెండు జిల్లాల చొప్పున ఎంపిక చేసిన టూరిస్ట్ స్పాట్లలో 500 మందితో ఈ ప్రదర్శనలు ఉంటాయి. వీటితో పాటు అన్ని ప్రభుత్వ"ఆఫీసులు, విద్యా సంస్థలు, పార్కులు, స్వర్ణ వార్డులు, స్వర్ణ గ్రామాల్లో నిరంతరాయంగా యోగా సాధన కార్యక్రమాలు జరుగుతాయి. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రత్యేక అవార్డులను కూడా అందజేయనున్నారు.
విస్తృతంగా శిక్షణ.. అందుబాటులోకి డిజిటల్ కంటెంట్
ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న 1.50 లక్షల మంది యోగా ట్రైనర్లకు అదనంగా మరో లక్ష మందిని కొత్తగా సిద్ధం చేసేందుకు ప్రభుత్వం శిక్షణా కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ యోగా, నాచురోపతి విభాగ సలహాదారు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు రూపొందించిన ప్రత్యేక యోగాంధ్ర-2026 పోస్టర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ప్రజలకు యోగాపై సంపూర్ణ అవగాహన కల్పించేందుకు మంతెన సత్యనారాయణ రాజు రూపొందించిన ప్రత్యేక వీడియో కంటెంట్‌ను పబ్లిక్ డొమైన్‌లోకి తీసుకురానున్నారు.
ఇందులో 90 రకాల ఆసనాల ప్రత్యేక వీడియోలు, 21 దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే ఆసనాలు రోజువారీ సాధన కోసం యోగాసనాలు, ప్రాణాయామంపై 7 ప్రత్యేక వీడియోలు ఉన్నాయి. ఈ యోగా శిక్షణా వీడియోలను ప్రజలు నేరుగా తమ మొబైల్స్‌లోకి డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక నంబర్‌ను కేటాయించింది. 8142404888 నంబర్‌కు వాట్సాప్‌లో "హాయ్" అని మెసేజ్ పంపడం ద్వారా లేదా అధికారిక క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఈ వీడియోలను ఉచితంగా పొందవచ్చునని సలహాదారు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు నారాయణ, సత్యకుమార్, ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్‌లతో పాటు సీఎస్ సాయి ప్రసాద్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, కమిషనర్ వీర పాండియన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
