Let's talk: editor@tmv.in
యోగాంధ్ర–2026.. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో డ్రైవర్లతో సామూహిక యోగా
యోగాంధ్ర–2026.. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో డ్రైవర్లతో సామూహిక యోగా

యోగాంధ్ర–2026.. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో డ్రైవర్లతో సామూహిక యోగా

Gaddamidi Naveen
11 జూన్, 2026

అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవం–2026 సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర–2026’ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం ఉదయం గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో లారీ, ఆటో డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, ఆర్డీవో జి. బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. యోగా ఆరోగ్యవంతమైన జీవనానికి మార్గదర్శకమని కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ నిత్యం యోగాతోనే తమ దినచర్యను ప్రారంభిస్తారని, వారి చురుకుదనానికి యోగానే కారణమని తెలిపారు. వయస్సు పెరిగినా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని, ఏకాగ్రతను కాపాడుకోవడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. భారతదేశం ప్రపంచానికి అందించిన ఈ గొప్ప వరాన్ని ప్రతి ఒక్కరూ ఇంటి వద్దే సాధన చేస్తూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు.

జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ.. ప్రభుత్వం వరుసగా రెండో సంవత్సరం కూడా ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని అంతే ఉత్సాహంతో నిర్వహిస్తోందన్నారు. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స తీసుకునే 'క్యూరేటివ్ హెల్త్ కేర్' కంటే, వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే 'ప్రివెంటివ్ హెల్త్ కేర్' ఉత్తమమైనదని, అందుకు యోగా ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. అనంతరం పురిటిగడ్డ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు, యోగా శిక్షకులు శేష ప్రసన్న, నాగరాజుల ఆధ్వర్యంలో అద్భుతమైన యోగా నృత్య ప్రదర్శన చేశారు. శిక్షకురాలు కే. చందు ప్రత్యేక యోగా విన్యాసాలతో ఆకట్టుకోగా.. ప్రతిభ కనబరిచిన వారిని కలెక్టర్, ఎమ్మెల్యేలు శాలువాలతో ఘనంగా సత్కరించారు.