

కోటి మంది భాగస్వామ్యంతో ఏపీలో యోగా.. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, మునుపెన్నడూ లేని రీతిలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది జూన్ 21న జరిగే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, రాష్ట్రవ్యాప్తంగా ‘యోగాంధ్ర-2026’ పేరిట రెండు వారాల పాటు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణను, విధివిధానాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ సోమవారం నాటి విలేకరుల సమావేశంలో సుదీర్ఘంగా వివరించారు.
“యోగా ఫర్ హెల్తీ ఏజింగ్” అనే విశిష్ట నినాదంతో (థీమ్‌తో) ఈసారి వేడుకలను డిజైన్ చేశారు. కేవలం ఒకే ఒక్క రోజు వేడుకగా కాకుండా, సమాజంలోని ప్రతి పౌరుడి దైనందిన జీవితంలో యోగాను ఒక అనివార్య భాగంగా మార్చడమే ఈ మెగా డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్ర సచివాలయంలో వైద్యారోగ్య శాఖ సెక్రటరీ సౌరభ్ గౌర్, ఆయుష్ డైరెక్టర్ జి.వీరపాండియన్, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ మంతెన సత్యనారాయణరాజులతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఏర్పాట్లను వేగవంతం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి మంది ప్రజలను ఈ యోగాంధ్ర భాగస్వామ్యంలోకి తీసుకురావాలనేది ప్రభుత్వ సంకల్పం. సమాజంలోని అన్ని వర్గాలను అంటే.. రైతులు, పొదుపు సంఘాల మహిళలు, మత్స్యకారులు, గిరిజనులు, సాంస్కృతిక కళాకారులు, యువజన సంఘాలు, ఆటో-లారీ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలను ఇందులో భాగస్వాములను చేస్తున్నారు. భవిష్యత్తు కోసం రాష్ట్రంలో 10 లక్షల మంది నిత్య సాధకులను (రెగ్యులర్ ప్రాక్టీషనర్స్) తయారు చేయాలనే సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. గత ఏడాది 1.5 లక్షల మంది శిక్షకులతో (ట్రైనర్స్) ఈ శిబిరాలు నిర్వహించగా, ఈ ఏడాది అదనంగా మరో లక్ష మందిని జోడించి మొత్తం 2.5 లక్షల మంది యోగా శిక్షకుల సేవలను వినియోగించుకుంటున్నారు. విద్యార్థి దశ నుంచే శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించేందుకు వీలుగా పాఠశాల విద్యలో యోగాను అంతర్భాగం చేస్తూ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.
ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించడానికి, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం మంగళగిరిలోని ఏపీఐఐసి భవనంలో అధునాతన సౌకర్యాలతో కూడిన ఒక ప్రత్యేక 'వార్ రూం' ను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఏపీ నిర్వహించిన యోగా కార్యక్రమాలకు 2 గిన్నిస్ బుక్ రికార్డులు, 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులతో పాటు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించిన సంగతిని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. ఈ విజయాల స్ఫూర్తితో యోగాను నిరంతర ప్రక్రియగా మార్చేందుకు వీలుగా శాశ్వత ప్రాతిపదికన 'ఏపీ యోగా ప్రచార పరిషత్' ఏర్పాటుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆమోదముద్ర వేశారని మంత్రి వెల్లడించారు. ఈ పరిషత్ కింద మూడు ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి, దీనికి సంబంధించిన నిధులు, ఫైలు ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉంది, త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
కార్యక్రమాల షెడ్యూల్ విషయానికొస్తే.. జూన్ 7 నుంచి 20వ తేదీ వరకు (14 రోజుల పాటు) రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా యోగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూన్ 7న శ్రీ సత్యసాయి జిల్లాలోని చారిత్రాత్మక క్షేత్రం లేపాక్షిలో ప్రారంభ కార్యక్రమాన్ని సూత్రప్రాయంగా నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఒక్కో జిల్లాకు ఒక ప్రత్యేక ఇతివృత్తం (థీమ్) కేటాయించారు.
ఉదాహరణకు ఎన్టీఆర్ జిల్లాలో పోలీసులకు, కోనసీమలో రైతులకు, కృష్ణా జిల్లాలో ఆటో-లారీ అసోసియేషన్లకు, తిరుపతిలో సెలబ్రిటీలకు, విశాఖపట్నంలో మాజీ సైనికోద్యోగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ యోగా నిర్వహిస్తారు.
అలాగే ప్రతి జిల్లాలో రెండేసి చొప్పున మొత్తం 56 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో (గుంటూరులో ఉండవల్లి గుహలు, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, నంద్యాలలో శ్రీశైలం, మహానంది, నెల్లూరులో మైపాడు బీచ్, స్వర్ణాల చెరువు వంటి చోట్ల) రోజుకు నాలుగు ప్రదేశాల చొప్పున కనీసం 500 మందితో వైభవంగా యోగా ప్రదర్శనలు ఉంటాయి.
ప్రజల్లో ఉత్సాహాన్ని నింపేందుకు జూన్ 7 నుంచి 20 వరకు నాలుగు అంచెల్లో (గ్రామ/వార్డు స్థాయి - జూన్ 7 నుండి 9 వరకు, మండల స్థాయి- జూన్ 10 నుండి 12 వరకు , జిల్లా స్థాయి- జూన్ 14 నుండి 16వరకు యోగా పోటీలు నిర్వహిస్తారు. వీటి గ్రాండ్ ఫినాలేను జూన్ 18 నుండి 20 వరకు విజయవాడలో రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తారు. ఈ పోటీలు వ్యక్తిగత విభాగం (ఆసనాలు, ప్రాణాయామం), బృంద విభాగం (సింక్రనైజ్డ్ గ్రూప్ యోగా), జ్ఞాన ఆధారిత విభాగాలలో (క్విజ్, వ్యాసరచన, నినాదాల పోటీలు) జరుగుతాయి. విజేతలకు జిల్లా, రాష్ట్ర స్థాయిలలో బహుమతులు అందజేస్తారు.
ఇక జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నాటి ప్రధాన రాష్ట్ర స్థాయి ముగింపు వేడుక రాజధాని అమరావతిలో, కృష్ణా నదిపై నిర్మించిన వెస్ట్ బైపాస్ వంతెనపై అత్యంత వైభవంగా జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ అద్భుత వేడుకలో సుమారు 25 వేల మంది ఏకకాలంలో యోగాసనాలు వేయనున్నారు. అదే రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో 3 వేల మందితో, సచివాలయాలు, పార్కులు, పాఠశాలల్లో భారీ ఎత్తున వేడుకలు జరుగుతాయి.
ఉచిత యోగాసనాల వీడియోలు
యోగాను ప్రతి ఇంటి గుమ్మంలోకి చేర్చే లక్ష్యంతో, యోగా, ప్రకృతి వైద్య ప్రభుత్వ సలహాదారు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన డిజిటల్ వీడియోలను ప్రజలకు పూర్తి ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. ఇందులో భాగంగా వివిధ ఆసనాలపై 90 వీడియోలు, రోగ నివారణకు సంబంధించిన ప్రత్యేక ఆసనాలపై 21 వీడియోలు, నిత్య సాధన (డైలీ ప్రాక్టీస్) కోసం 7 సెట్ల వీడియోలు, యోగాపై సాధారణ అనుమానాలను నివృత్తి చేసే 50 షార్ట్ వీడియోలను సిద్ధం చేశారు. ప్రజలు తమ మొబైల్స్ నుండి 8142404888 అనే వాట్సప్ నెంబరుకు కేవలం 'Hi' అని మెసేజ్ పంపడం ద్వారా వచ్చే క్యూఆర్ కోడ్, లేదా గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా ఈ వీడియోలను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీటితో పాటు ప్రభుత్వం అధికారికంగా అందించే 'సంజీవని యాప్' ద్వారా కూడా యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానానికి సంబంధించిన వీడియోల సమాచారాన్ని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంచుతున్నట్లు వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది.
