Let's talk: editor@tmv.in
6 వేల మందితో యోగా మహోత్సవం.. హైదరాబాద్‌కు ప్రపంచ రికార్డు
6 వేల మందితో యోగా మహోత్సవం.. హైదరాబాద్‌కు ప్రపంచ రికార్డు
6 వేల మందితో యోగా మహోత్సవం.. హైదరాబాద్‌కు ప్రపంచ రికార్డు

6 వేల మందితో యోగా మహోత్సవం.. హైదరాబాద్‌కు ప్రపంచ రికార్డు

Gaddamidi Naveen
3 మే, 2026

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 12వ ఎడిషన్‌ యోగా దినోత్సవానికి ఇంకా 50 రోజులు ఉన్న సందర్భంగా, కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా హైదరాబాద్‌లోని కన్హా శాంతి వనంలో శనివారం ఘనంగా 'యోగా మహోత్సవం' నిర్వహించింది. వేలాది మంది యోగా అభ్యాసకులు, యువత, విదేశీ ప్రతినిధులు పాల్గొనడంతో ప్రాంగణం ఉత్సాహభరితంగా మారింది.

ఈ కార్యక్రమంలో ఒకేసారి 6,000 మందికి పైగా యోగా అభ్యాసకులు ఏకధాటిగా 'భుజంగాసనం' ప్రదర్శించి సరికొత్త రికార్డు సృష్టించారు. ఇంత పెద్ద ఎత్తున జనం పాల్గొని ఈ ఆసనాన్ని ప్రదర్శించడం ఇదే తొలిసారి కావడంతో, ఈ ఘనత 'ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో నమోదైంది. సామూహిక భాగస్వామ్యం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలనే ఆశయానికి ఇది నిదర్శనంగా నిలిచింది.

వికసిత్ భారత్ లక్ష్యానికి యోగా ప్రాణాధారం

ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో నేడు యోగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందని, 2047 నాటికి 'వికసిత్ భారత్' సాకారం కావాలంటే సమాజం ఆరోగ్యంగా, క్రమశిక్షణతో ఉండాలని, దానికి యోగా ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, అది భారతీయ నాగరికత ప్రపంచానికి అందించిన గొప్ప జీవన విధానమని కొనియాడారు. హైదరాబాద్ కేవలం సాంకేతికతకే కాకుండా, ప్రపంచ యోగా, వెల్‌నెస్ హబ్‌గా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

కేంద్ర ఆరోగ్య, ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో యోగా ఒక ప్రపంచ ఉద్యమంగా మారిందన్నారు. భారతదేశం వెల్‌నెస్ టూరిజంకు కేంద్రంగా మారుతోందని, దీనిని ప్రోత్సహించేందుకు 'యోగా 365' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా జూన్ 21 వరకు లక్ష మందికి ఉచిత యోగా శిక్షణ ఇచ్చి 'యోగ్ మిత్ర' సర్టిఫికేట్లు అందజేయనున్నట్లు తెలిపారు.

ప్రపంచవ్యాప్త భాగస్వామ్యం

ఈ మహోత్సవంలో కేవలం భారతీయులే కాకుండా బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, క్యూబా, కజకిస్థాన్ వంటి 20కి పైగా దేశాల ప్రతినిధులు, రాయబారులు పాల్గొన్నారు. కామన్ యోగా ప్రోటోకాల్ (సీవైపీ) ప్రదర్శన అనంతరం, హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ అధిపతి దాజీ నేతృత్వంలో ధ్యాన ప్రక్రియ జరిగింది.

యోగా దినోత్సవానికి 25 రోజుల కౌంట్‌డౌన్ సందర్భంగా నిర్వహించే తదుపరి యోగా మహోత్సవం మధ్యప్రదేశ్‌లోని చారిత్రాత్మక ప్రాంతమైన ఖజురహోలో జరగనుందని మంత్రులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డి.కె. అరుణ, ఆయుష్ శాఖ కార్యదర్శి రాజేష్ కోటెచా, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

6 వేల మందితో యోగా మహోత్సవం.. హైదరాబాద్‌కు ప్రపంచ రికార్డు - Tholi Paluku