
వైసీపీవి అబద్ధపు ప్రచారాలు.. వ్యవసాయాన్ని పండుగలా మార్చాం: మంత్రి అచ్చెన్నాయుడు
రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న తప్పుడు ప్రచారాలపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం హయాంలో వ్యవసాయ రంగం సాధించిన అద్భుత విజయాలను గణాంకాలతో సహా వివరించారు. వైసీపీ నేతలు, ముఖ్యంగా ఆ పార్టీ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అబద్ధాలను ప్రచారం చేయడంలో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్నారని ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
గత వైసీపీ పాలనలో రైతులు అప్పుల భారంతో ఆత్మహత్యలకు పాల్పడిన దుస్థితి ఉండేదని అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని మళ్ళీ ఒక పండుగలా మార్చిందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 143 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయిన ఆహార ధాన్యాల ఉత్పత్తిని కేవలం ఏడాది కాలంలోనే 237 లక్షల టన్నులకు పెంచినట్లు ఆయన వెల్లడించారు. ఇది సుమారు 51 శాతం వృద్ధి అని, ఇది ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం వెనకడుగు వేయబోదని చెబుతూ ధరల స్థిరీకరణ నిధి (పి.ఎస్.ఎఫ్.) కింద భారీగా కేటాయింపులు పెంచినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. సుమారు రూ.588 కోట్లతో పొగాకు, మామిడి, ఉల్లి, కోకో పండించే రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చామన్నారు. ముఖ్యంగా ఉల్లి రైతులకు ఇచ్చే నష్టపరిహారాన్ని హెక్టారుకు రూ.25 వేల నుంచి ఏకంగా రూ.50 వేలకు పెంచినట్లు తెలిపారు. అదేవిధంగా మొక్కజొన్న రైతుల సమస్యల పరిష్కరం కోసం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని రైతులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకునేలా ఒత్తిడి తెస్తున్నామని స్పష్టం చేశారు.
ఇక రాష్ట్రంలో మైక్రో ఇరిగేషన్ విప్లవాన్ని తీసుకొచ్చామని గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ.881 కోట్ల డ్రిప్, స్ప్రింక్లర్ బకాయిలను కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వమే చెల్లించి రైతులకు ఊరటనిచ్చిందని గుర్తు చేశారు. చంద్రబాబు విజన్‌కు అనుగుణంగా రాయలసీమను గ్లోబల్ హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని ఆయిల్ పామ్ సాగులో ఏపీని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టామన్నారు. ఇన్ని వాస్తవాలు కళ్ళముందు కనిపిస్తున్నప్పటికీ వైసీపీ నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం అసత్యాలు ప్రచారం చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.
