

పెరిగిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా నేడు వైసీపీ రాష్ట్రవ్యాప్త నిరసన
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎన్నికల ముందు ఇంధన ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలపై అదనపు భారం మోపుతోందని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా విమర్శించారు. నిన్న (ఆదివారం) పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన ఈ నిరసనల ప్రణాళికను వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక ఇంధన ధరలు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే పెరిగిన జీవన వ్యయాలతో సామాన్యులు అల్లాడిపోతుంటే, ప్రభుత్వం ధరలను తగ్గించాల్సింది పోయి మరింత పెంచిందని సజ్జల మండిపడ్డారు. ఈ ధరల పెంపు వల్ల రైతులు, రవాణా రంగం, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని పేర్కొన్నారు. ఇంధన ధరల పెరుగుదల రవాణా ఛార్జీలపై ప్రభావం చూపి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడానికి కారణమవుతోందని దీనివల్ల అన్ని రంగాల్లో ఆర్థిక ఇబ్బందులు మరింత తీవ్రమవుతున్నాయని ఆయన వివరించారు. గతంలో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇంధన ధరల తగ్గింపుపై ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ ఇప్పుడు వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు.
నియోజకవర్గ కేంద్రాల్లో వినూత్న నిరసనలు
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు స్వయంగా ఈ ఆందోళనలకు నాయకత్వం వహించనున్నారు. నిరసనల అనంతరం స్థానిక జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల దృష్టిని ఆకర్షించేలా వినూత్న రీతిలో ఈ కార్యక్రమాలు చేపట్టాలని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అనుబంధ విభాగాలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ రోజు జరిగే ఆందోళనలను విజయవంతం చేయాలని సజ్జల పిలుపునిచ్చారు.
అత్యధిక ఇంధన ధరలు ఉన్న తొలి 5 రాష్ట్రాలు
దేశంలో పెట్రోల్ ధరలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రాల వారీగా పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి:
• ఆంధ్రప్రదేశ్ – లీటరుకు సుమారు రూ .113.62
• తెలంగాణ – లీటరుకు సుమారు రూ.110.89
• కేరళ – లీటరుకు సుమారు రూ.110.48
• బీహార్ – లీటరుకు సుమారు రూ.110.27
• మధ్యప్రదేశ్ – లీటరుకు సుమారు రూ. 110.25
