Let's talk: editor@tmv.in
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్

Shaik Mohammad Shaffee
25 ఏప్రిల్, 2026

ఏపీలో సంచలనం సృష్టించిన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు, వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు)ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. రాజమహేంద్రవరం కోర్టు సముదాయం నుంచి విచారణ ముగించుకుని బయటకు వస్తున్న సమయంలో కాకినాడ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సాక్షులను భయభ్రాంతులకు గురిచేసి, ప్రలోభపెట్టారన్న తీవ్ర అభియోగాలపై ఈ చర్యలు చేపట్టారు.

కోర్టు వద్ద హైడ్రామా.. భారీ పోలీసు మోహరింపు

తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న అనంతబాబు, గత కొద్దిరోజులుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నారు. ఈ క్రమంలో తనపై నమోదైన బెయిల్ రద్దు పిటిషన్ విచారణ కోసం ఆయన శుక్రవారం తన భార్య లక్ష్మీదుర్గతో కలిసి రాజమహేంద్రవరం కోర్టుకు హాజరయ్యారు. ఎమ్మెల్సీ రాకను ముందే పసిగట్టిన పోలీసులు కోర్టు ప్రాంగణంలో భారీగా మోహరించారు. విచారణ అనంతరం ఆయన కోర్టు గది వెలుపలికి రాగానే, పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను హుటాహుటిన కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

సాక్షులను గదిలో బంధించి బెదిరింపులు!

ఈ కేసులో అనంతబాబుపై సాక్షులను బెదిరించారన్న ఆరోపణలతో ఈ నెల 20న సర్పవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం, కేసులో కీలక సాక్షులైన అరవ దుర్గ శివప్రసాద్, అరవ మణికంఠ, ఎస్. పవన్ కుమార్, ముమ్మిడి వెంకటేశ్‌లను ఎమ్మెల్సీ అనుచరులు అపహరించి కాకినాడలోని ఒక అపార్ట్‌మెంట్‌లో బంధించారు. కోర్టులో ఎమ్మెల్సీకి వ్యతిరేక సాక్ష్యం చెప్పవద్దని, సాక్ష్యం మార్చుకుంటే ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున నగదు ఇస్తామని ఆశ చూపారు. మాట వినకపోతే ప్రాణాలు తీస్తామని భయపెట్టారు. అయితే సాక్షులు ఆ ప్రలోభాలకు లొంగకుండా తమకు ఇచ్చిన నగదును పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు.

బెయిల్ రద్దుకు పిటిషన్

సాక్షులను ప్రభావితం చేయడం ద్వారా బెయిల్ నిబంధనలను అనంతబాబు ఉల్లంఘించారని పోలీసుల తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు పూర్తి ఆధారాలతో పోలీసులు కోర్టుకు విన్నవించారు.

సీఐపై వేటు.. కొత్త అధికారుల నియామకం

మరోవైపు ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సర్పవరం ఇన్‌ఛార్జ్ సీఐ రవికుమార్‌పై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్సీకి పోలీసుల కదలికలపై సమాచారం చేరవేసి, ఆయన పరారీకి సహకరించారన్న ఆరోపణలతో రవికుమార్‌ను ‘వేకెన్సీ రిజర్వ్’ (వీఆర్)కు పంపారు. ప్రస్తుతం తుని రూరల్ సీఐ చెన్నకేశవరావును విచారణాధికారిగా నియమించగా, సర్పవరం పీఎస్ బాధ్యతలను కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణకు అప్పగించారు.