Let's talk: editor@tmv.in
అక్రమ కేసులతో వైసీపీని అణచలేరు:మాజీ మంత్రి అంబటి రాంబాబు

అక్రమ కేసులతో వైసీపీని అణచలేరు:మాజీ మంత్రి అంబటి రాంబాబు

Panthagani Anusha
2 మే, 2026

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎదుర్కోలేక పోలీసులను పావులుగా వాడుకుంటోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు కుప్పకూలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు.

గత జనవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యల నెపంతో ఇప్పటికే తనపై 32 కేసులు నమోదు చేశారని తాజాగా పులివెందుల, వేంపల్లి ప్రాంతాల్లో మరిన్ని కేసులు బనాయించారని అంబటి పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ కక్షసాధింపు చర్యేనని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా వైఎస్సార్‌సీపీ మీడియా ఇన్‌చార్జ్ పూడి శ్రీహరి అరెస్టు ఉదంతాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియా పోస్టుల పేరుతో ఆయనను వేధించడం దారుణమన్నారు. కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా తిరిగి అరెస్టు చేసి గుంటూరుకు తరలించడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని ఆయన ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని రౌడీలు, సంఘవిద్రోహులపై వాడాల్సిన లాఠీలను పోలీసులు రాజకీయ నాయకులపై ప్రయోగిస్తున్నారని అంబటి విమర్శించారు. ఇటీవల ఓ జర్నలిస్టు హత్యకు గురికావడం రాష్ట్రంలో నెలకొన్న అరాచక పరిస్థితులకు అద్దం పడుతోందని ఆయన అన్నారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా పాలకుల కనుసన్నల్లో పనిచేస్తున్నారని ప్రభుత్వాలు శాశ్వతం కాదని రేపు వైఎస్సార్‌సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా ఆయన పోలీసులను హెచ్చరించారు.

కేవలం రాజకీయ వేధింపులే కాకుండా ప్రజా సమస్యలను కూడా ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతకు ప్రభుత్వ అనాలోచిత విధానాలే కారణమని హోల్‌సేల్ కొనుగోళ్లపై తీసుకున్న నిర్ణయాల వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలను దేవుళ్లుగా అభివర్ణించిన కూటమి నేతలు ఇప్పుడు కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి పేరుతో సాగుతున్న ప్రచారాన్ని తప్పుబడుతూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అంబటి రాంబాబు హితవు పలికారు.