Let's talk: editor@tmv.in
యాసంగి ధాన్యం సేకరణ 60 లక్షల మెట్రిక్ టన్నులు దాటింది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

యాసంగి ధాన్యం సేకరణ 60 లక్షల మెట్రిక్ టన్నులు దాటింది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Gaddamidi Naveen
30 మే, 2026

ప్రస్తుత యాసంగి (రబీ) సీజన్‌లో భారతదేశం మొత్తం మీద సేకరించిన వరి కొనుగోళ్లలో దాదాపు 60 శాతం వాటాను ఒక్క తెలంగాణ రాష్ట్రమే సాధించిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. రాష్ట్రంలో వరి కొనుగోళ్లు ఇప్పటికే 60 లక్షల మెట్రిక్ టన్నుల మార్కును దాటాయన్నారు. దేశంలోని ఆహార ధాన్యాల సేకరణ వ్యవస్థకు తెలంగాణ ‘వెన్నుముక’గా మారిందని ఆయన కొనియాడారు. హైదరాబాద్‌లో తన కేబినెట్ సహచరులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఈ వివరాలను వెల్లడించారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత యాసంగి సీజన్‌లో దేశవ్యాప్తంగా సేకరించిన మొత్తం వరిలో దాదాపు 60 శాతం ఒక్క తెలంగాణ నుంచే రావడం గర్వకారణం. ఈ కొనుగోళ్ల ప్రక్రియ ముగిసే సమయానికి దేశం మొత్తం రబీ వరి సేకరణలో తెలంగాణ వాటా దాదాపు 75 శాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నామ‌ని చెప్పారు.

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ వరి కొనుగోళ్లలో అగ్రస్థానంలో ఉందని మంత్రి గణాంకాలతో సహా వివరించారు. తెలంగాణ ఇప్పటికే 60 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించగా.. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 24 లక్షల మెట్రిక్ టన్నులు, తమిళనాడులో 11-12 ఎల్‌ఎంటీలు, మహారాష్ట్రలో 3 ఎల్‌ఎంటీలు, కేరళలో దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసినట్లు తెలిపారు. సెంట్రల్ పూల్ మెకానిజం కింద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) కి బియ్యాన్ని సరఫరా చేయడంలో కూడా తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు.

కేంద్రం పరిమితి కంటే 15 శాతం అధికం

తెలంగాణ నుంచి కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల వరిని మాత్రమే సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 60 ఎల్‌ఎంటీ మార్కును దాటిందని మంత్రి గుర్తుచేశారు. కేంద్రం విధించిన పరిమితి కంటే 15 శాతం అదనంగా కొనుగోళ్లు జరిగాయని, ఇది మన రైతుల అసాధారణ ఉత్పాదకతను, రైతుల ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న అచంచలమైన నిబద్ధతను తెలియజేస్తోందని అన్నారు. ఈ యాసంగి (2025-26) లో 64.36 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, దీని ద్వారా సుమారు 141 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చినట్లు అంచనా వేశారు. జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో, ఆలోపే కొనుగోళ్లను పూర్తి చేసేలా చర్యలు వేగవంతం చేశామన్నారు. అయితే, రాష్ట్రంలో ప్రతి ఏటా వరి ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ, ఎఫ్‌సీఐ ద్వారా కేంద్రం సేకరించే బియ్యం కోటాను తగ్గిస్తోందని మంత్రి ఆరోపించారు. ఈ విషయమై తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామన్నారు.

రూ. 11,050 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి

ఈ భారీ కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయడం కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, సుమారు 13,000 రవాణా వాహనాలను, రెండు లక్షలకు పైగా సిబ్బందిని రవాణా, లాజిస్టిక్స్ సేవల కోసం రంగంలోకి దించిందని మంత్రి వివరించారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కింద ఇప్పటివరకు రూ. 11,050 కోట్లను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఈ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025-26 లో ఖరీఫ్, రబీ రెండు పంటల కాలాలకు కలిపి రైతుల చెల్లింపులు, కొనుగోలు ఖర్చులు మొత్తం రూ. 39,300 కోట్లు దాటాయని చెప్పారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల తడిసిన 10,214 మెట్రిక్ టన్నుల వరిని తక్షణమే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించి, రైతులకు ఎలాంటి నష్టం లేకుండా ఎంఎస్‌పీ చెల్లించామని వెల్లడించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వరి కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ చరిత్రలోనే ఇంత భారీ స్థాయిలో, పక్కా ప్రణాళికతో వరి కొనుగోళ్లు జరగడం ఇదే ప్రథమమని మంత్రులు స్పష్టం చేశారు.