Let's talk: editor@tmv.in
పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యే లక్ష్యం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యే లక్ష్యం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Gaddamidi Naveen
4 జులై, 2026

గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన ప్రపంచ స్థాయి ఇంగ్లీష్ బోర్డింగ్ విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర నీటిపారుదల, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నల్గొండ జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామంలో రూ.250 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌తో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఇంగ్లీష్ మీడియం బోర్డింగ్ విద్య అందించేందుకు ఈ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థను నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ పాఠశాలలో ఒకేసారి 2,500 మంది విద్యార్థులు చదువుకునేలా ఆధునిక మౌలిక సదుపాయాలు, విశాలమైన తరగతి గదులు, వసతి గృహాలు, భోజనశాలలు, క్రీడా సదుపాయాలు, ఆహ్లాదకరమైన విద్యా వాతావరణాన్ని కల్పిస్తున్నట్లు వివరించారు. పాఠశాల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, గుత్తేదారులు, ఇంజినీర్లు నిరంతరం పర్యవేక్షణలో పనులు చేపడుతున్నారని మంత్రి తెలిపారు. నిర్మాణ నాణ్యతను స్వయంగా పరిశీలించేందుకే తాను సందర్శించినట్లు చెప్పారు.

వచ్చే ఏడాది 2027 నాటికి నిర్మాణ పనులు పూర్తిచేసి, 2027–28 విద్యా సంవత్సరంలో ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌లో తరగతులను ప్రారంభించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గ్రామీణ పేద కుటుంబాల పిల్లలకు నగర స్థాయి విద్యను వారి ప్రాంతంలోనే అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు
UttamKumarReddyIntegratedSchoolsResidentialSchoolsEducationEnglishMediumTelanganaTelanganaNewsGovernmentSchoolsQualityEducation
పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యే లక్ష్యం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి - Tholi Paluku