
వర్క్ ఫ్రమ్ బైక్.. ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదకు వస్తుంది: సీపీ సజ్జనార్
సాధారణంగా మనం రైళ్లు, మెట్రో లేదా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొందరు ఐటీ ఉద్యోగులు సమయం వృధా కాకుండా ల్యాప్‌టాప్‌లు ఓపెన్ చేసి ఆఫీస్ పనులు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. ట్రాఫిక్‌లో సమయాన్ని ఆదా చేసుకోవడానికి ఇదొక మార్గంగా భావిస్తారు. కానీ, హైదరాబాద్‌లో ఓ యువకుడు బైక్‌పై ప్రయాణిస్తూ ల్యాప్‌టాప్‌లో పని చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ స్పందిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్న ఆయన, రోడ్డుపై ఇలాంటి బాధ్యతారాహిత్యమైన చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు.
"ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది. కానీ, ప్రాణాలను పణంగా పెట్టి ఇలా వర్క్ ఫ్రమ్ బైక్ చేయడం చూస్తుంటే... ‘ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదకు వస్తుంది’ అనే మాట అక్షరాలా నిజమనిపిస్తోంది" అని సజ్జనార్ పేర్కొన్నారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఏకాగ్రత ఒక్క క్షణం తప్పినా, అది మీ ప్రాణానికే కాదు, పక్కన వెళ్లే అమాయకుల ప్రాణాలకు కూడా ప్రమాదకరం. కడుపు నింపుకోవడానికి చేసే పని, కడతేర్చేలా ఉండకూడదు గుర్తుంచుకోండి. రోడ్డుపై ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులు మానుకోండి. సురక్షితంగా ప్రయాణించి.. గమ్యస్థానాలకు చేరుకోండి అని ఆయన ప్రజలను కోరారు.
