Let's talk: editor@tmv.in
మహిళల సంక్షేమమే ధ్యేయం:ఎమ్మెల్యే గల్లా మాధవి

మహిళల సంక్షేమమే ధ్యేయం:ఎమ్మెల్యే గల్లా మాధవి

Panthagani Anusha
20 మే, 2026

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని మహిళల ఆర్థిక సాధికారత, సంక్షేమమే లక్ష్యంగా తమ వంతు సహాయాన్ని నిరంతరం అందిస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. మంగళవారం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ‘మహిళా గ్రీవెన్స్’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత రెండు వారాలుగా జీవనోపాధి కోసం విజ్ఞప్తి చేసిన ముగ్గురు పేద మహిళలకు టిఫిన్ బండ్లు, కూరగాయలు, పూల వ్యాపారాలు చేసుకునేందుకు వారి చేతుల మీదుగా తోపుబండ్లను పంపిణీ చేశారు.

మహిళల సమస్యలను నేరుగా తెలుసుకుని తక్షణ పరిష్కారం చూపేందుకే ప్రతి మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా సమస్యలపై వచ్చే అర్జీలను పరిశీలిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే వచ్చిన సమస్యల్లో 80 శాతం వరకు విజయవంతంగా పరిష్కరించామని ఆమె వెల్లడించారు.

ఇదిలాఉండగా ఈ వారం జరిగిన గ్రీవెన్స్‌కు మహిళల నుండి వినతులు వెల్లువెత్తాయి. నూనె మరియమ్మ వితంతు పెన్షన్, షేక్ మౌలాబీ కిడ్నీ పెన్షన్ కోరగా బొడ్డుపల్లి జయలక్ష్మి, చెరుకూరి సుబ్బాయమ్మ, ఆర్థిక సాయం కోసం అభ్యర్థించారు. విద్యాపరంగా బి.నవ్య స్కాలర్‌షిప్ బకాయిలు ఆరోగ్యపరంగా ఆషా వైద్య సహాయం కోరారు. అదేవిదంగా సంపత్ నగర్‌లో ఇళ్లకు ఆనుకొని ఉన్న ప్రమాదకర విద్యుత్ లైన్‌పై కే. శాంతి నాయక్ ఫిర్యాదు చేశారు.

మరో ముఖ్యమైన ఫిర్యాదులో 28వ డివిజన్ సీతమ్మ కాలనీ వాటర్ ప్లాంట్ వద్ద యువకులు గంజాయి సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్యే తీవ్రంగా స్పందిస్తూ సదరు ప్రాంతంలో తక్షణమే గస్తీ పెంచి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.