
ఈ నెల 25 నుంచి 31 వరకు ‘మహిళా వారోత్సవాలు’
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక"లో భాగంగా ఈ నెల 25 నుంచి 31 వరకు నిర్వహించనున్న "మహిళా వారోత్సవాల"పై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళా సాధికారతను చాటిచెప్పేలా ఈ వారోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం చేయాలని ఆమె ఆదేశించారు.
మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, జీవనోపాధి కార్యక్రమాలు, ఆర్థిక స్వావలంబన చర్యలు ప్రజలకు స్పష్టంగా తెలియజేసేలా కార్యక్రమాలు ఉండాలని మంత్రి సూచించారు. ప్రతిరోజూ భిన్న రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాలను ప్రతిబింబించేలా ప్రత్యేక షెడ్యూల్ రూపొందించాలని తెలిపారు. కనీసం 4 వేల గ్రామాల్లో మహిళా భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యుల విజయగాథలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల ద్వారా సాధించిన ఆర్థిక పురోగతి, ఉపాధి అవకాశాల విస్తరణ, మహిళల నాయకత్వ వికాసం, సామాజిక మార్పు వంటి అంశాలను ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా మహిళా సాధికారత, మహిళల విజయాల ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
“ఇందిరా మహిళాశక్తి” కార్యక్రమం కింద మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యల పురోగతిని కూడా మంత్రి సమీక్షించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, వ్యవసాయ, అనుబంధ, వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి, వ్యాపార అవకాశాల కల్పనకు సంబంధించిన కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. మహిళలను కేవలం ఉద్యోగార్థులుగానే కాకుండా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ దానకిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్, సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా తదితర అధికారులు పాల్గొన్నారు.
