Let's talk: editor@tmv.in
మహిళా వారోత్సవాలను విజయవంతం చేయాలి: మంత్రి సీతక్క

మహిళా వారోత్సవాలను విజయవంతం చేయాలి: మంత్రి సీతక్క

Panthagani Anusha
24 మే, 2026

రాష్ట్ర వ్యాప్తంగా రేపటినుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న మహిళా వారోత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, విజయవంతం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అధికారులను ఆదేశించారు. మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన, సామాజిక భద్రత, విద్యా పురోగతి, మరియు మహిళల జీవనోపాధిని బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యాలుగా ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ వారోత్సవాల నిర్వహణ, కార్యక్రమాల షెడ్యూల్, మరియు క్షేత్రస్థాయి ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో మంత్రి సీతక్క ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కీలక సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, కమిషనర్ దివ్య దేవరాజన్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, మరియు శాఖ డైరెక్టర్ శృతి ఓజా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మహిళా సంఘాలను కేవలం ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా, వారిని సామాజికంగా మరింత విజయవంతం చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంటును ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ ప్రాజెక్టు మహిళా సంఘాల స్వయం సమృద్ధికి, ఆర్థిక శక్తికి ఒక నిదర్శనంగా నిలుస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా వారోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపేలా మహిళా సాధికారతకు ఒక కొత్త దిశానిర్దేశం చేసేలా ఉండాలని అధికారులకు సూచించారు.

వారోత్సవాల్లో భాగంగా ప్రతి రోజుకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించినట్లు అధికారులు ఈ సమావేశంలో వెల్లడించారు. ఈ ఏడు రోజుల వేడుకల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాల ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. వీటితో పాటు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడిచే ఆర్టీసీ బస్సుల ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం మహిళా భద్రత, రక్షణపై విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. అదేవిధంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ఇన్క్యుబేటర్ కార్యక్రమాలు, మహిళల్లో అక్షరాస్యతను పెంపొందించేందుకు ప్రత్యేక డ్రైవ్‌లను చేపట్టనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.