Let's talk: editor@tmv.in
ఈ నెల 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా వారోత్సవాలు : మంత్రి సీతక్క

ఈ నెల 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా వారోత్సవాలు : మంత్రి సీతక్క

Panthagani Anusha
22 మే, 2026

తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా “మహిళా వారోత్సవాలు” అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాలు, యువతులు, బాలికలు, దివ్యాంగులు, వృద్ధులు సహా అన్ని వర్గాల మహిళలను భాగస్వామ్యులను చేస్తూ వారం రోజుల పాటు విభిన్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ఆర్థిక స్వావలంబన, సామాజిక భద్రతపై ప్రత్యేక దృష్టి

మహిళల ఆర్థిక స్వావలంబన, జీవనోపాధుల విస్తరణ, సామాజిక భద్రత, ఆరోగ్యం, రక్షణ, మౌలిక వసతుల అభివృద్ధి, మహిళా సంఘాల బలోపేతంపై ఈ వారోత్సవాల్లో ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు, మౌలిక వసతుల ప్రారంభోత్సవాలు, జీవనోపాధి యూనిట్ల గ్రౌండింగ్, రుణమేళాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే పక్కా కార్యాచరణ రూపొందించిందని స్పష్టం చేశారు.

ఈ ఉత్సవాల్లో భాగంగా మే 29వ తేదీన హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు ఆర్థిక అవకాశాలను విస్తరించే దిశగా ఈ కార్యక్రమం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

మహిళా సంఘాలను కేవలం పొదుపు సమూహాలుగా మాత్రమే పరిమితం చేయకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించే ప్రధాన ఉత్పాదక శక్తులుగా తీర్చిడిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. మహిళలకు బ్యాంకు రుణాలు, జీవనోపాధి యూనిట్లు, సూక్ష్మ పరిశ్రమలు, వ్యవసాయ ప్రాసెసింగ్ కేంద్రాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు వంటి ఉపాధి అవకాశాలను నేరుగా గ్రామ స్థాయికే తీసుకెళ్తున్నామని వివరించారు. మహిళల చేతుల్లో ఆదాయం పెరిగితే కుటుంబాలతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుందని తెలిపారు.

వారోత్సవాల తొలి విడత కార్యక్రమాల వివరాలు

ఈ వారోత్సవాలు మే 25న వికారాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, కుమురంభీం ఆсиఫాబాద్ జిల్లాల్లో 0.5 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ల ప్రారంభోత్సవంతో ప్రారంభం కానున్నాయి. అదే రోజు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడిచే 450 ఆర్టీసీ బస్సులను ఫ్లాగ్ ఆఫ్ చేయడంతో పాటు ఎస్‌హెచ్‌జీల ప్రత్యేక సమావేశాలు, పోషకాహార అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మే 26న సామాజిక సమీకరణ దినంగా పాటిస్తూ అర్హులైన మహిళలు, వృద్ధులు, దివ్యాంగులను గుర్తించి వారిని స్వయం సహాయక సంఘాల్లో చేర్పించేలా ప్రత్యేక డ్రైవ్ చేపడతారు. అదేవిధంగా మే 28న మహిళా సంఘ భవనాలు, వర్క్ షెడ్లు, గోదాముల నిర్మాణాలకు రాష్ట్రవ్యాప్తంగా శంకుస్థాపనలు చేయనున్నారు.

ముగింపు రోజుల్లో విస్తృత సేవలు, పంపిణీలు

మే 29న మండల స్థాయిలో రుణమేళాలు నిర్వహించి కోళ్ల పెంపకం, సూక్ష్మ పరిశ్రమలు, తేనెటీగల పెంపకం యూనిట్లు, బయో ఇన్‌పుట్ రిసోర్స్ సెంటర్ల గ్రౌండింగ్ కార్యక్రమాలు చేపడతారు. ఇదే వేదికగా దివ్యాంగులకు బ్యాటరీ వాహనాలు, మహిళలకు ఆయిల్ బండ్లు, నెక్ ఎగ్ కార్ట్స్ పంపిణీ చేస్తారు. ఇక చివరి రోజుల్లో అంటే మే 30, 31 తేదీల్లో జిల్లా మహిళా సమాఖ్య భవనాల ప్రారంభోత్సవాలు, పెట్రోల్ పంపుల భూమిపూజలు ఉంటాయి. టీనేజ్ బాలికలకు సైకిళ్ల పంపిణీ, చదువు నేర్చుకున్న మహిళలకు “అమ్మకు అక్షరమాల” కింద సత్కారం, ఉచిత ఆరోగ్య శిబిరాలు, మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ కూడా చేపట్టనున్నారు.

విజయవంతం చేయాలని మంత్రి పిలుపు

ప్రజా పాలనలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళా సంఘాలను అత్యంత కీలక శక్తిగా మార్చేందుకు ప్రభుత్వం ఈ వారోత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేసి ఈ వారం రోజుల కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.