
మహిళా రిజర్వేషన్ బిల్లు చారిత్రాత్మకం: వైఎస్సార్‌సీపీ
దేశవ్యాప్తంగా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'రాజ్యాంగ 131వ సవరణ బిల్లు'కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ) బేషరతుగా తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మహిళల రాజకీయ సాధికారత దిశగా ఇది ఒక చారిత్రాత్మక అడుగు అని దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే శక్తి ఈ బిల్లుకు ఉందని ఆ పార్టీ నేతలు, మాజీ మంత్రులు వి. రజని, పాముల పుష్ప శ్రీవాణి కొనియాడారు. శుక్రవారం వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ, లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టడాన్ని స్వాగతించారు.
నిర్ణయాధికారంలో మహిళలలే కీలకం
శాసనసభలు, లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం పెరగడం వల్ల పాలనలో గుణాత్మక మార్పులు వస్తాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు. మహిళలు జనాభాలో సగం ఉన్నప్పటికీ ప్రస్తుత చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం 14 శాతం కంటే తక్కువగా ఉండటం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ రంగంలో 34 శాతం, కార్మిక శక్తిలో 40 శాతం వాటా కలిగి ఉన్న మహిళలకు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యం దక్కడం దేశాభివృద్ధికి ఎంతో అవసరమని వారు స్పష్టం చేశారు.
జగన్ పాలన - జాతీయ స్థాయి ప్రమాణం
వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి తన హయాంలోనే మహిళా పక్షపాతిగా నిలిచారని నేతలు గుర్తు చేశారు. స్థానిక సంస్థల పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి వంటి అత్యున్నత పదవుల్లో మహిళలను కూర్చోబెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని వారు వివరించారు. రాష్ట్రంలో మహిళల కోసం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు, రాజకీయ ప్రాధాన్యతలను ఉటంకిస్తూ.. జగన్‌మోహన్ రెడ్డి నెలకొల్పిన ప్రమాణాలే నేడు జాతీయ స్థాయిలో మహిళా బిల్లుకు ప్రేరణగా నిలిచాయని పేర్కొన్నారు.
ఈ చట్టం అమల్లోకి వస్తే మహిళలపై జరిగే అన్యాయాలపై చట్టసభల్లో గట్టిగా పోరాడే అవకాశం కలుగుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల మహిళలకు కూడా ఈ రిజర్వేషన్ల ఫలాలు అందాలని పార్టీ కోరుకుంటోంది. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ మహిళా బిల్లు ఆమోదం పొందడం ద్వారా దేశవ్యాప్త మహిళా లోకానికి రాజకీయ రక్షణ కవచం లభిస్తుందని పేర్కొంది.
