
మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటమి.. యూపీ సీఎం పాదయాత్ర
మహిళా రిజర్వేషన్ అమలు కోసం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు ఓటమిపై ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరిగింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ‘జన్ ఆక్రోష్ మహిళా పాదయాత్ర’కు నేతృత్వం వహించి ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. లక్నోలో ముఖ్యమంత్రి నివాసం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర విధాన్ భవన్ వరకు కొనసాగింది. ఇందులో వేలాది మహిళలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి, ఉప ముఖ్యమంత్రులు కేశవ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ తదితరులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా నిలిచి కాంగ్రెస్, సమాజవాదీ పార్టీలు తమ ‘మహిళా వ్యతిరేక’ వైఖరిని బయటపెట్టాయని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన అవకాశాన్ని వారు దుర్వినియోగం చేసుకున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా మహిళలు ప్రజాస్వామ్య పద్ధతిలో రోడ్డెక్కి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని, లక్నోలో జరిగిన భారీ ర్యాలీ దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ నిరసనలను ప్రతి జిల్లా, ప్రతి స్థాయికి విస్తరించాలని పిలుపునిచ్చారు. మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రస్తావిస్తూ, ఉజ్వల, ఆయుష్మాన్ భారత్, స్వచ్ఛ భారత్ వంటి పథకాలు మహిళల గౌరవం, ఆరోగ్యం, స్వావలంబనకు దోహదపడుతున్నాయని అన్నారు.
ప్రతిపక్షంలో కూర్చోవడానికి ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఉంది
ఇదిలా ఉండగా సమాజవాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్ ఈ పాదయాత్రపై వ్యంగ్యంగా స్పందించారు. ఇది బీజేపీ ప్రతిపక్షంలో కూర్చోడానికి ‘ప్రాక్టీస్’ చేస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం తనే తీసుకొచ్చిన చట్టం కోసం ఇంతగా పోరాడడం చరిత్రలో ఇదే మొదటిసారి అని అన్నారు. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఓటమిని ‘చారిత్రక ప్రజాస్వామ్య విజయం’గా అభివర్ణించిన అఖిలేశ్, ప్రతిపక్షాల ఐక్యత వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్‌కు తమ పార్టీ ఎప్పటినుంచో మద్దతు ఇస్తోందని చెప్పారు. అలాగే పీడీఏ (పిచ్ఛడా, దళిత్, అల్పసంఖ్యాకులు) అనే సామాజిక సమీకరణతో భవిష్యత్తులో బీజేపీని ఓడిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. మహిళల భద్రత విషయంలో యూపీ ప్రభుత్వం విఫలమైందని కూడా ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని, ప్రభుత్వం వాటిని దాచిపెడుతోందని విమర్శించారు.
