
మహిళా రిజర్వేషన్ బిల్లు.. దేశ చరిత్రలో నూతన అధ్యాయం - ప్రధాని మోడీ
భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఏప్రిల్ 17, 2026 ఒక మైలురాయిగా నిలిచిపోనుందని, లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపీలందరికీ అత్యంత కీలకమైన విజ్ఞప్తి చేశారు. దేశ జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకు వారి హక్కులను కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు. "నారీ శక్తి వందన్ అధినియం" (రాజ్యాంగ 131వ సవరణ బిల్లు) కు ఏకగ్రీవంగా మద్దతు తెలపాలని, రాజకీయాలకు అతీతంగా మహిళా సాధికారత కోసం అందరూ ఏకం కావాలని బిల్లుపై ఓటింగ్ కు ముందు ఆయన పిలుపునిచ్చారు.
నిర్ణయాధికారంలో సగభాగం
గత నాలుగు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లు, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై ప్రధాని మాట్లాడుతూ.. స్వాతంత్ర౦ వచ్చి ఇన్నేళ్లు గడిచినా, నిర్ణయాధికార ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉండటం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఈ చట్టం ద్వారా మహిళలకు కేవలం కోటా మాత్రమే కాకుండా, దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మహిళలు ఈ చారిత్రాత్మక నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
లోక్‌సభ స్థానాల పెంపు, డీలిమిటేషన్
ఈ చారిత్రాత్మక మార్పును అమలు చేయడానికి ప్రభుత్వం సాంకేతిక, రాజ్యాంగపరమైన సవరణలను కూడా సిద్ధం చేసింది. మహిళా కోటాను సక్రమంగా అమలు చేసేందుకు లోక్‌సభ సభ్యుల సంఖ్యను 816 కి పెంచే ప్రతిపాదన ఇందులో ఉంది. దీనికి అనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజన, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులపై కూడా లోక్‌సభలో ఓటింగ్ జరగనుందని, ఈ పరిపాలనాపరమైన మార్పులు మహిళా రిజర్వేషన్లను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడానికి పునాది వేయనున్నాయని మోడీ అన్నారు.
అపోహల తొలగింపు - పారదర్శక చర్చలు
మహిళా రిజర్వేషన్ బిల్లుపై గత రెండు రోజులుగా పార్లమెంటులో సుదీర్ఘ చర్చలు జరిగాయి. గురువారం ప్రారంభమైన ఈ చర్చలు అర్థరాత్రి ఒంటి గంట వరకు కొనసాగడం దీని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. విపక్షాలు, ఇతర సభ్యులు లేవనెత్తిన ప్రతి సందేహానికి ప్రభుత్వం వాస్తవాలతో, తార్కికంగా సమాధానమిచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. అపోహలకు తావులేకుండా, సమాచార లోపం లేకుండా ప్రతి అంశాన్ని స్పష్టం చేశామని, ఇప్పుడు దేశ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత సభ్యులపై ఉందని ఆయన ఉద్ఘాటించారు.
మనస్సాక్షితో ఓటు వేయండి
ప్రధాని మోడీ తన ప్రసంగంలో ఎంపీల వ్యక్తిగత భావోద్వేగాలను కూడా స్పృశించారు. "ప్రతి సభ్యుడు తమ కుటుంబంలోని మహిళలను స్మరించుకుని, మనస్సాక్షితో ఓటు వేయాలి" అని కోరారు. మహిళల పట్ల వివక్ష చూపడం లేదా వారి హక్కులను కాలరాయడం వంటి చర్యలు వారి సెంటిమెంట్లను గాయపరుస్తాయని ఆయన హెచ్చరించారు. నారీ శక్తికి కొత్త అవకాశాలను కల్పించడంలో ఏ ఒక్క సభ్యుడు అడ్డుపడకూడదని, భారతదేశ ప్రజాస్వామ్య సౌధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ అవకాశం వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ఈ బిల్లు ఆమోదం పొందితే అది కేవలం ఒక చట్టంగానే కాకుండా, భారతదేశ సామాజిక మార్పుకు సంకేతంగా నిలుస్తుందని ప్రధాని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. "మనం అందరం కలిసి చరిత్ర సృష్టిద్దాం" అంటూ ఆయన ఎంపీలను ఉత్సాహపరిచారు. మహిళలకు సరైన ప్రాతినిధ్యం లభించినప్పుడే దేశం నిజమైన అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందితే, అది నవ భారత నిర్మాణంలో ఒక స్వర్ణ అధ్యాయంగా నిలిచిపోవడం ఖాయం అన్నారు.
వీగిపోయిన బిల్లు
మోడీ, అమిత్ షా ఈ బిల్లుపై వివరణ ఇచ్చినప్పటికీ రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్‌సభలో 298 ఓట్లు వచ్చాయి. అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ (352 ఓట్లు) లేకపోవడంతో అది వీగిపోయింది. 230 మంది ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. 2011 జనాభా గణన ఆధారంగా లోక్‌సభ సీట్లను గరిష్టంగా పెంచాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను విపక్షాలు తిప్పికొట్టాయి.
