Let's talk: editor@tmv.in
సీవీడ్ సాగుతో మహిళల ఆర్థిక సాధికారత: ఏపీ సీఎం

సీవీడ్ సాగుతో మహిళల ఆర్థిక సాధికారత: ఏపీ సీఎం

Panthagani Anusha
8 మే, 2026

రాష్ట్రంలోని సుదీర్ఘ తీరప్రాంతాన్ని ఆర్థిక వనరుగా మలుచుకుంటూ సముద్ర నాచు (సీవీడ్) సాగు ద్వారా మహిళలు, మత్స్యకారులకు స్థిరమైన ఆదాయం కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సీవీడ్ ఫార్మింగ్ అభివృద్ధి దాని విలువ జోడింపు అవకాశాలపై బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన కీలక దిశానిర్దేశం చేశారు.

మహిళా స్వయం సహాయక సంఘాలకు అండగా

ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సుమారు 974 కిలోమీటర్ల తీరప్రాంతం సీవీడ్ సాగుకు అత్యంత అనువైనదని సీఎం పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు, మత్స్యకార కుటుంబాలకు ఇది అదనపు ఆదాయ వనరుగా మారుతుందని ఆయన ఆకాంక్షించారు. సీవీడ్ సాగును కేవలం ఉత్పత్తికే పరిమితం చేయకుండా, దాని ద్వారా వచ్చే లాభాలను విశ్లేషిస్తూ ఒక పక్కా ‘ఎకనామిక్ మోడల్’ సిద్ధం చేయాలని అధికారులను కోరారు.

అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం

వాణిజ్య స్థాయిలో సీవీడ్ ఉత్పత్తిని పెంచేందుకు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి పరిశోధనా సంస్థలతో కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సెంట్రల్ సాల్ట్ మెరైన్ రీసెర్చి ఇనిస్టిట్యూట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో ఆయన వర్చువల్‌గా చర్చించారు. సీవీడ్ సాగులో అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి అమృతా విశ్వ విద్యాపీఠం సహకారంతో ఒక సమగ్ర నివేదికను రూపొందించాలని ఆదేశించారు.

సీవీడ్ కేవలం ఆహారంగానే కాకుండా ఫార్మా, న్యూట్రాస్యూటికల్, కాస్మెటిక్ రంగాలలో కీలక ముడిసరుకుగా ఉపయోగపడుతుందని సీఎం వివరించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీనికి ఉన్న విపరీతమైన డిమాండ్‌ను అందిపుచ్చుకోవాలని ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా విలువ జోడింపు ఉత్పత్తులను తయారు చేయాలని స్పష్టం చేశారు. తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తోడ్పడటమే కాకుండా సముద్ర ఉత్పత్తుల ద్వారా సంపద సృష్టికి ఇది ఒక కీలక ప్రత్యామ్నాయంగా మారుతుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.