

వికసిత్ భారత్ నిర్మాణంలో మహిళలే కీలకం: మన్సుఖ్ మాండవీయ
దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం కేవలం సామాజిక అవసరం మాత్రమే కాదని, అది ఆర్థిక అనివార్యమని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో మహిళా సాధికారత దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోందని, 'వికసిత్ భారత్' లక్ష్య సాధనలో మహిళలే కేంద్రబిందువులని ఆయన పేర్కొన్నారు. స్విగ్గి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్విగ్‌స్ట్రీ: సెలబ్రేటింగ్ ఉమెన్ ఆన్ ద మూవ్’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, అడ్డంకులను అధిగమించి డెలివరీ భాగస్వాములుగా రాణిస్తున్న మహిళలను అభినందించారు.
గణనీయంగా పెరిగిన మహిళా భాగస్వామ్యం
గడిచిన ఎనిమిదేళ్లలో దేశంలో మహిళా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు ఆశాజనకంగా వృద్ధి చెందిందని కేంద్రమంత్రి వెల్లడించారు. దీనికి సంబంధించిన గణాంకాలను ఆయన వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 2017-18లో పని చేసే మహిళల శాతం కేవలం 23.3 శాతం ఉండగా, 2025 నాటికి అది 40 శాతానికి చేరుకుని దాదాపు రెట్టింపయ్యింది. అదేవిధంగా జనాభా నిష్పత్తి ప్రకారం చూసినా మహిళా కార్మికుల సంఖ్య 22 శాతం నుండి 39 శాతానికి పెరిగింది. మరోవైపు ఉద్యోగం కోసం వెతికే మహిళల్లో నిరుద్యోగిత రేటు 5.6 శాతం నుండి 3.1 శాతానికి తగ్గడం శుభపరిణామమని, ఉద్యోగాల కోసం ప్రయత్నించే మహిళలకు ఇప్పుడు అవకాశాలు మెరుగ్గా దొరుకుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
గిగ్ వర్కర్లకు చట్టబద్ధ గుర్తింపు
దేశంలో డెలివరీ బాయ్స్, గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్న లక్షలాది మందికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గతేడాది నవంబర్ నుండి అమల్లోకి వచ్చిన కొత్త కార్మిక చట్టాల ద్వారా గిగ్, ప్లాట్‌ఫారమ్ వర్కర్లకు తొలిసారిగా చట్టబద్ధమైన గుర్తింపు లభించిందని మాండవీయ తెలిపారు. "కొత్త సామాజిక భద్రతా కోడ్ (2020) ద్వారా గిగ్ వర్కర్లకు చట్టబద్ధ గుర్తింపుతో పాటు సామాజిక భద్రత పొందే హక్కు లభించింది. వీరికి ఇన్సూరెన్స్, పెన్షన్ వంటి సదుపాయాలు కల్పించే దిశగా అడుగులు పడ్డాయి" అని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.
సమాన పనికి సమాన వేతనం
మహిళలు ఉద్యోగాల్లో ఎదుర్కొనే వివక్షను తొలగించేందుకు ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. లింగ భేదం లేకుండా ఒకే రకమైన పనికి స్త్రీ, పురుషులకు సమాన వేతనం అందించే సూత్రాన్ని చట్టబద్ధం చేసినట్లు తెలిపారు. అంతేకాదు మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు, ప్రసూతి సెలవుల హక్కును మరింత బలోపేతం చేశామని, పని ప్రదేశాల్లో తప్పనిసరిగా 'క్రెచ్' (శిశు సంరక్షణ కేంద్రాలు) ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు.
ఆర్థిక స్వావలంబనకు 'గిగ్' ఉపాధి వేదిక
తమ సమయం, వీలును బట్టి పనిచేసుకునే అవకాశం ఉండటం వల్ల మహిళలకు గిగ్ ప్లాట్‌ఫారమ్‌లు (స్విగ్గి వంటివి) గొప్ప వరమని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అభిప్రాయపడ్డారు. కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే, డెలివరీ భాగస్వాములుగా పనిచేస్తున్న మహిళలు సమాజానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్విగ్గి ఫుడ్ మార్కెట్ ప్లేస్, ఇన్‌స్టామార్ట్‌లో అత్యుత్తమ సేవలందిస్తున్న మహిళా డెలివరీ పార్ట్‌నర్లను కేంద్ర మంత్రి స్వయంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్విగ్గి కో-ఫౌండర్ శ్రీహర్ష మెజేటితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
