
కలలకు రెక్కలు..నందిగామ పదవ తరగతి టాపర్లకు విమాన ప్రయాణం
బడుగు వర్గాల విద్యార్థుల కలలను నిజం చేస్తూ, వారి విద్యా ప్రతిభను అపూర్వ రీతిలో గౌరవించిన విశేష కార్యక్రమంగా ‘కలలకు రెక్కలు’ నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురు విద్యార్థులకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్ వరకు విమాన ప్రయాణం కల్పించారు. సాధారణంగా బస్సు, రైలు వంటి ప్రయాణాలకు మాత్రమే పరిమితమైన పేద విద్యార్థులకు, ఈ విమాన ప్రయాణం జీవితంలో ఒక అపురూప అనుభవంగా మిగిలిపోయింది. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే సౌమ్య స్వయంగా విద్యార్థులతో కలిసి విమానాశ్రయానికి చేరుకుని వారిని అభినందిస్తూ ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు.
ఈ గౌరవాన్ని పొందిన విద్యార్థులంతా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందినవారే కావడం గమనార్హం. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపిస్తూ 589 మార్కులు సాధించిన షేక్ అర్షియా నాజ్, 576 మార్కులతో ప్రజాపతి పర్వీన్, 571 మార్కులు సాధించిన దొడ్డదేవరపాడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థి, 567 మార్కులతో పల్లెపోగు వినీల, 559 మార్కులు సాధించిన నారిశెట్టి జగదీష్ ఆదిత్య, మరియు 549 మార్కులు సాధించిన ఉప్పులూరి సోనీ ప్రియ ఈ బృందంలో ఉన్నారు. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో విద్యార్థుల ముఖాల్లో కనిపించిన ఆనందం వారి భవిష్యత్తు లక్ష్యాల పట్ల ఉన్న పట్టుదలను ప్రతిబింబించింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర విద్యా వ్యవస్థ గణనీయంగా బలోపేతం అవుతోందని పేర్కొన్నారు. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి ఉత్తీర్ణత శాతం 81.14 ఉండగా ఈ ఏడాది అది 85.25 శాతానికి పెరిగిందని అదేవిదంగా నందిగామ నియోజకవర్గంలో కూడా ఫలితాలు 74.80 శాతం నుంచి 80.08 శాతానికి పెరగడం సంతోషకరమని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ఉపాధ్యాయులకు అంతర్జాతీయ శిక్షణ, విద్యార్థులకు ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని ఆమె కొనియాడారు.
ఇదిలా ఉండగా విద్యార్థి విజయానికి తల్లిదండ్రుల కష్టం ఉపాధ్యాయుల నిరంతర మార్గదర్శకత్వం ఎంతో కీలకమని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ఈ చిన్న ప్రోత్సాహం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా వారిని మరిన్ని పెద్ద కలలు కనేలా స్ఫూర్తినిస్తుందని కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఈ కార్యక్రమం పట్ల ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
