Let's talk: editor@tmv.in
పవన శక్తే దేశాన్ని ముందుకు నడిపిస్తోంది: ప్రధాని మోడీ

పవన శక్తే దేశాన్ని ముందుకు నడిపిస్తోంది: ప్రధాని మోడీ

Pinjari Chand
27 ఏప్రిల్, 2026

దేశ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన పురోగతిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్‌కీ బాత్‌’ 133వ ఎపిసోడ్‌లో ప్రస్తావించారు. పునరుత్పాదక శక్తి నుంచి వన్యప్రాణి సంరక్షణ, అణుశక్తి, జనగణన వరకు పలు అంశాలపై ఆయన మాట్లాడారు.

పవన విద్యుత్‌లో 56 గిగావాట్ల మైలురాయి

దేశంలో పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 56 గిగావాట్లను దాటిందని మోడీ తెలిపారు. కనిపించని శక్తి అయినా, దేశాన్ని ముందుకు నడిపిస్తుంది పవన శక్తే అని పేర్కొన్నారు. పవన శక్తి వినియోగంలో భారత్ ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉందని చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 6.05 గిగావాట్ల సామర్థ్యం పెరగడం విశేషమని, ఇది గత ఏడాదితో పోలిస్తే సుమారు 46 శాతం వృద్ధి అని వివరించారు. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు ఈ వృద్ధికి ప్రధాన కారణమయ్యాయని తెలిపారు.

వన్యప్రాణి సంరక్షణలో పురోగతి

దేశంలో వన్యప్రాణి సంరక్షణ చర్యలు ఫలిస్తున్నాయని పేర్కొన్న ఆయన, బ్లాక్‌బక్‌(జింకలో ఒక జాతి)లు ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కనిపించడం ఆనందదాయకమన్నారు. అలాగే అంతరించిపోతున్న గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్‌(అరుదైన పక్షి జాతి) సంరక్షణ కోసం శాస్త్రీయ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రకృతి, మనిషి పరస్పర భాగస్వాములని ఆయన పేర్కొన్నారు.

చీజ్ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు

బ్రెజిల్‌లోని ముండియల్‌ డు క్వైజో డు బ్రెజిల్‌ పోటీలో భారతీయ చీజ్ ఉత్పత్తులు సూపర్ గోల్డ్, గోల్డ్, సిల్వర్ అవార్డులు సాధించడం గర్వకారణమన్నారు. భారతీయ డెయిరీ రంగం విలువ ఆధారిత ఉత్పత్తులతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని తెలిపారు.

అణుశక్తిలో కీలక ఘట్టం

తమిళనాడులోని కాల్పక్కంలో ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ తొలి ‘క్రిటికాలిటీ’ సాధించడాన్ని చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఇది స్వదేశీ సాంకేతికతతో నిర్మించిందని, దేశ శక్తి భద్రతకు దోహదపడుతుందని అన్నారు.

2027 జనగణనలో ప్రజల భాగస్వామ్యం కీలకం

భారత జనగణన–2027లో ప్రతి పౌరుడు పాల్గొనాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈసారి డిజిటల్ విధానంలో జనగణన జరుగుతుందని, స్వయంగా వివరాలు నమోదు చేసే సౌకర్యం కూడా కల్పించామని చెప్పారు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

భారత చరిత్రకు డిజిటల్ ద్వారం

నేషనల్ అర్కైవ్స్‌ ఆఫ్‌ ఇండియా రూపొందించిన ‘అభిలేఖ్ పటల్’ పోర్టల్‌లో 200 మిలియన్లకు పైగా పత్రాలు డిజిటైజ్ చేసినట్టు చెప్పారు. రాణి లక్ష్మీ భాయ్‌ లేఖలు, సుభాశ్‌ చంద్రబోస్‌కు సంబంధించిన పత్రాలు వంటి చారిత్రక సమాచారం అందుబాటులో ఉందని వివరించారు.

మే నెలలో వచ్చే బుద్ధ పౌర్ణమి సందర్భంగా దేశ ప్రజలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. గౌతమ బుద్ధ బోధనలు ఇప్పటికీ ప్రాసంగికమని అన్నారు.

సంగీతానికి కొత్త వేదిక

రిపబ్లిక్ డే వేడుకల ముగింపును సూచించే బీటింగ్‌ రీట్రిట్‌ కార్యక్రమంలోని సంగీతాన్ని తొలిసారిగా వేవ్స్‌ ఓటీటీలో అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. మొత్తంగా, దేశ అభివృద్ధి, సాంకేతిక పురోగతి, పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక వారసత్వం వంటి విభిన్న రంగాల్లో భారత్ సాధిస్తున్న విజయాలను ప్రధాని ఈ కార్యక్రమంలో ప్రస్తావించారు.