Let's talk: editor@tmv.in
అక్రమ దందాలకు అడ్డొస్తే లారీలతో తొక్కిస్తారా?: మాజీ మంత్రి హరీష్ రావు

అక్రమ దందాలకు అడ్డొస్తే లారీలతో తొక్కిస్తారా?: మాజీ మంత్రి హరీష్ రావు

Gaddamidi Naveen
23 జూన్, 2026

బొగ్గు టిప్పర్ లారీ ఢీకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణా అధికారి (డీటీఓ) వెంకన్న మరణించడంపై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అనుమానం వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటనపై ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, వెంకన్న ప్రమాదం వెనుక దాగిన నిజాన్ని వెలికితీయాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.

ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా? అని హరీష్ రావు ప్రశ్నించారు. అధికారులను బెదిరిస్తూ అక్రమ దందాలు సాగిస్తున్న ఇసుక, బొగ్గు మాఫియా వివరాలను ప్రభుత్వం తక్షణమే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. డీటీఓ వెంకన్న మరణం వెనుక ఉన్న వాస్తవాలను ప్రజల ముందుంచాలని, దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులకే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తూ.. ఇలాంటి దారుణాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

వెంకన్న మృతి ప్రమాదవశాత్తూ జరిగిందే: మంత్రి పొన్నం ప్రభాకర్

విధి నిర్వహణలో ఉన్న డీటీఓ వెంకన్న మృతి చెందడంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటీవల జగిత్యాల నుంచి భూపాలపల్లికి బదిలీపై వచ్చిన వెంకన్న.. నిబంధనలు ఉల్లంఘించిన హార్వెస్టర్‌ను కార్యాలయానికి తరలిస్తుండగా టిప్పర్ ఢీకొని మరణించారని మంత్రి వివరించారు.

ఈ ఘటనపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చుతూ.. ఇది ముమ్మాటికీ ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనేనని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని, ఈ సమయంలో శవ రాజకీయాలు చేయవద్దని మంత్రి హితవు పలికారు. ఘటనపై సీఎం ఢిల్లీ నుంచి మాట్లాడారని, ప్రిన్సిపాల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి విచారణకు ఆదేశించామని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాకు చెందిన వెంకన్న కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ప్రకటించారు. మైనింగ్, గ్రానైట్, ఫ్లై యాష్ వాహనాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్‌లతో సహా రవాణా శాఖలో అనేక సంస్కరణలు తెస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

ట్యాగ్‌లు
BhupalpallyJayashankarBhupalpallyMVIVenkannaVenkannaRoadAccidentTelanganaNewsBreakingNewsTransportDepartmentRoadSafety
అక్రమ దందాలకు అడ్డొస్తే లారీలతో తొక్కిస్తారా?: మాజీ మంత్రి హరీష్ రావు - Tholi Paluku