
దొంగలను వదిలేసి ఫిర్యాదుదారులను జైల్లో పెడతారా:
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి అక్రమ కేసులు, సిట్‌లు, కమిషన్లతో కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్ రావు మండిపడ్డారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ సహా పార్టీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజాస్వామ్యాన్ని ఏడో గ్యారంటీగా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ నాయకత్వంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తే నిందితులను వదిలేసి ఫిర్యాదుదారుడైన క్రిశాంక్‌ను అరెస్ట్ చేయడం దుర్మార్గమని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగలను వదిలేసి ఫిర్యాదుదారులను జైలుకు పంపడం ఏ రకమైన న్యాయం? అని ప్రశ్నించారు. అంగన్‌వాడీ ఫోన్ల కుంభకోణం, టెన్త్ పేపర్ లీక్ వంటి ప్రజా సమస్యలను ఎత్తిచూపినందుకే కక్షపూరితంగా వరుస కేసులు పెట్టారని క్రిశాంక్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయడంపై స్వయంగా మెజిస్ట్రేట్ పోలీసులను ప్రశ్నించడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రభుత్వం కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ప్రైవేట్ హ్యాకర్లను ఉపయోగించి బీఆర్ఎస్ నేతల ఫోన్లు, సీసీ కెమెరాలను చట్టవ్యతిరేకంగా హ్యాక్ చేస్తోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని భవిష్యత్తులో దీనిపై విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో లగచర్ల గిరిజనుల నుంచి మెదక్, సంగారెడ్డి కార్యకర్తల వరకు అందరిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఇలాంటి చర్యలతో మళ్లీ అధికారంలోకి వస్తామని భావించడం హిట్లర్‌ను మించిన మూర్ఖత్వమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రైతాంగ సమస్యలపై స్పందిస్తూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీశ్ రావు విమర్శించారు. మక్కల కొనుగోలుకు కొత్త షరతులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని యాసంగి సన్నవడ్లకు బోనస్‌పై ఇప్పటికీ స్పష్టత లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా అక్రమ కేసులు ఉపసంహరించుకుని ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీల అమలుపై దృష్టి సారించాలని హితవు పలికారు. మన్నె క్రిశాంక్‌పై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని లేనిపక్షంలో ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
