Let's talk: editor@tmv.in
ఎక్సైజ్ కేసులో హైకోర్టు జడ్జి ముందు హాజరుకాను: కేజ్రీవాల్

ఎక్సైజ్ కేసులో హైకోర్టు జడ్జి ముందు హాజరుకాను: కేజ్రీవాల్

Pinjari Chand
28 ఏప్రిల్, 2026

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ స్వర్ణకాంత శర్మకు లేఖ రాస్తూ కీలక నిర్ణయం ప్రకటించారు. ఎక్సైజ్ కేసులో ఇకపై ఆమె ముందు వ్యక్తిగతంగా గానీ, న్యాయవాది ద్వారా గానీ హాజరుకానని తెలిపారు. తన నిర్ణయం ‘సత్యాగ్రహ మార్గం’లో భాగమని పేర్కొన్నారు. నాలుగు పేజీల లేఖలో కేజ్రీవాల్ న్యాయం జరగడమే కాకుండా, అది కనిపించాలి కూడా అనే సూత్రాన్ని ప్రస్తావిస్తూ, ఈ కేసులో తాను ‘చాలా అన్యాయం’ ఎదుర్కొంటున్నానని పేర్కొన్నారు. ఈ నిర్ణయం తేలికగా తీసుకోలేదని, కానీ తన మనస్సాక్షి ప్రకారం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.

ఇంతకుముందు జస్టిస్ శర్మ కేసు నుంచి తప్పుకోవాలని (రెక్యూసల్‌) కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏప్రిల్ 20న తిరస్కరించారని గుర్తుచేశారు. అయితే ఆ పిటిషన్‌ను వ్యక్తిగత దాడిగా భావించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తన అభ్యర్థనను న్యాయపరమైన సందేహంగా చూడాల్సింది కానీ, వ్యక్తిగతంగా తీసుకున్నారని లేఖలో తెలిపారు. ఈ కేసులో తాను నిష్పక్షపాతంగా విచారణ పొందడం అసాధ్యమని భావిస్తున్నానని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ముఖ్యంగా, న్యాయమూర్తి ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధమైన అఖిల భారతీయ అధివక్త పరిషత్‌తో సంబంధాలు ఉన్నాయని, అలాగే ఆమె కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాద ప్యానెల్‌లలో పనిచేస్తున్నారని ఆయన తన సందేహాలకు కారణాలుగా పేర్కొన్నారు.

నేను న్యాయవ్యవస్థకు వ్యతిరేకంకాను

తాను కోర్టులో హాజరైనప్పుడు నాకు న్యాయం జరుగుతుందా? అనే ప్రశ్న తనలో ఉండేదని, ఇప్పుడు ఆ సందేహం మరింత పెరిగిందని చెప్పారు. ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని, ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, తాను న్యాయవ్యవస్థకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. గతంలో కోర్టుల ద్వారా తనకు బెయిల్ వంటి ఉపశమనం లభించిందని, న్యాయవ్యవస్థపై తన గౌరవం అలాగే ఉందని తెలిపారు. ఈ అభ్యంతరం కేవలం ఈ కేసుకు మాత్రమే పరిమితమని చెప్పారు. తాను ఈ నిర్ణయం వల్ల చట్టపరంగా నష్టపోయే అవకాశం ఉందని అంగీకరించిన కేజ్రీవాల్, అయినప్పటికీ తన మనస్సాక్షి ప్రకారం ముందుకు వెళ్తానని చెప్పారు. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కును కూడా తన వద్ద ఉంచుకున్నట్లు తెలిపారు.

గాంధీజీ సత్యాగ్రహ సూత్రాల ప్రస్తావన

మహాత్మాగాంధీ సూత్రాలను ప్రస్తావిస్తూ, అన్యాయం ఎదురైతే ముందుగా సంభాషించాలని, మార్పు కోసం అవకాశం ఇవ్వాలని అన్నారు. తాను కూడా అదే విధంగా ముందుగా జడ్జిని కోరానని, కానీ ఆమె నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. హైకోర్టు మాత్రం కేజ్రీవాల్ వాదనలను ఖండించింది. జడ్జి కుటుంబ సభ్యులు తమ వృత్తి చేసుకోవడం సహజమని, అది కేసుతో సంబంధం లేదని తెలిపింది. పబ్లిక్ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల పక్షపాతం నిరూపించబడదని స్పష్టం చేసింది.