



మెస్సీ పర్యటనను కూడా రాజకీయం చేస్తారా?: సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ చేస్తోన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అధికారిక కార్యక్రమాన్ని కూడా ప్రతిపక్షం తప్పుబట్టడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, అరుట్ల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స (టీపీఎస్) ను బుధవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతేడాది మెస్సీ హైదరాబాద్ పర్యటనను గుర్తుచేసుకున్నారు. ప్రపంచం నలుమూలల చూస్తుండగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల పిల్లలతో నేను మెస్సీతో కలిసి ఫుట్‌బాల్ ఆడించాను. ఆ నిరుపేద పిల్లలకు అది జీవితాంతం గుర్తుండిపోయే తీపి గుర్తు కాదా? నేను క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తుంటే, రేవంత్ రెడ్డి మెస్సీని హైదరాబాద్‌కు తీసుకువచ్చాడనే విషయాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్సీ పర్యటనను వ్యతిరేకిస్తున్న వారికి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదని బీఆర్‌ఎస్ పేరు ఎత్తకుండా ముఖ్యమంత్రి హెచ్చరించారు.
రూ. 685 కోట్ల టెండర్లలో రూ. 3,000 కోట్ల అవినీతా?
సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో వివిధ వస్తువుల కొనుగోలు కోసం తమ ప్రభుత్వం కేవలం రూ. 685 కోట్లకు టెండర్లు పిలిస్తే.. బీఆర్‌ఎస్ నాయకులు ఏకంగా రూ. 3,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని సీఎం ఎద్దేవా చేశారు. మొత్తం టెండర్ల విలువ రూ. 685 కోట్లు అయితే, అందులో రూ. 3,000 కోట్ల అవినీతి ఎలా సాధ్యమో వారికే తెలియాలని, అలాంటి వారి అజ్ఞానానికి తాను జాలిపడుతున్నానని పేర్కొన్నారు.
విద్యా రంగానికి పెద్దపీట
తమ ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే మొత్తం బడ్జెట్‌లో 8.50 శాతం నిధులు, అంటే సుమారు రూ. 27,000 కోట్లను విద్య కోసమే కేటాయించినట్లు సీఎం వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల సమాజంలో ఉన్న చిన్నచూపును మారుస్తూ, కార్పొరేట్ సంస్థలకు పోటీగా అరుట్లలో నిర్మించిన 'తెలంగాణ పబ్లిక్ స్కూల్' లో అడ్మిషన్లు అప్పుడే నిండిపోయాయని బోర్డు పెట్టే పరిస్థితి రావడం ఒక గొప్ప మార్పు అని హర్షం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి వంటి గొప్ప నాయకులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవారేనని, ప్రభుత్వ బడుల్లో చదవడం అవమానకరం కాదని గుర్తుచేశారు.
సమాజంలో కుల విచక్షణలను పూర్తిగా నిర్మూలించేందుకు, అన్ని వర్గాల విద్యార్థులు ఒకే చోట కలిసి చదువుకునేలా 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్' ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. వీటితో పాటు విజ్ఞాన, క్రీడా రంగాల్లో యువతను తీర్చిదిద్దేందుకు 'యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ', 'యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ'లను కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్థాపిస్తోందని చెప్పారు. కార్పొరేట్ స్థాయి వసతులతో ఆధునిక హంగులతో రూపొందిన అరుట్ల టీపీఎస్ పాఠశాల ముఖ్యమంత్రి కలల ప్రాజెక్ట్ కావడం విశేషం.
అరుట్లలో ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను ప్రారంభించిన సీఎం రేవంత్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న దాదాపు 27 లక్షల మంది విద్యార్థి యువతకు ఈ ప్రారంభోత్సవ శుభ సందర్భాన్ని సీఎం అంకితం చేశారు. ప్రీ-ప్రైమరీ (నర్సరీ) నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో, పూర్తి ఇంగ్లీష్ మీడియం బోధనతో ఈ ఆదర్శ పాఠశాలను తీర్చిదిద్దారు. తెలంగాణలోనే మొట్టమొదటిదైన ఈ అత్యాధునిక పాఠశాలను ప్రారంభించిన అనంతరం, సీఎం ఆవరణ ఆసాంతం తిరిగి పరిశీలించారు. ఇదే వేదికగా పాఠశాలల్లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించిన సీఎం, విద్యార్థినీ విద్యార్థులతో కలిసి స్వయంగా అల్పాహారం తీసుకున్నారు.
ల్యాబ్‌లు, తరగతి గదుల పరిశీలన
కార్పొరేట్ విద్యాసంస్థలను తలపించేలా నిర్మించిన తరగతి గదులు, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, లైబ్రరీతో పాటు ఫిజిక్స్, బాటనీ, కెమిస్ట్రీ సైన్స్ ల్యాబరేటరీలను సీఎం క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థుల ఉచిత రవాణా సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన బస్సులను చూశారు. నృత్యం, సంగీతం బోధించే ప్రత్యేక గదులను సందర్శించిన ఆయన, వంటగది పరిశీలన సమయంలో అక్కడ వంటవారితో ముచ్చటిస్తూ సరదాగా పూరీల తయారీలో సహకరించారు. అనంతరం ఉపాధ్యాయులు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్
క్రీడలకు పెద్దపీట వేస్తూ పాఠశాల ఆవరణలో అంతర్జాతీయ స్థాయిలో వాలీబాల్, క్రికెట్, ఫుట్‌బాల్, కబడ్డీ మైదానాలను, టెన్నిస్, క్యారమ్స్ హాళ్లను అద్భుతంగా తీర్చిదిద్దారు. సీఎం రేవంత్ రెడ్డి మైదానంలోకి దిగి విద్యార్థులతో కలిసి కొద్దిసేపు సరదాగా ఫుట్‌బాల్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్థాయి వసతులు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య, క్రీడలు అందాలనేదే ప్రభుత్వ సంకల్పం. అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు సీఎంకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో సీఎం మొక్కను నాటారు. ఎంతోమంది విద్యార్థులతో కరచాలనం చేస్తూ వారిని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రి డి. శ్రీధర్ బాబు, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె. కేశవ రావు, శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
