Let's talk: editor@tmv.in
అమరావతి అవినీతిపై కోర్టుకు వెళ్తా: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

అమరావతి అవినీతిపై కోర్టుకు వెళ్తా: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

Gaddamidi Naveen
4 జులై, 2026

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ), ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న భిన్న వాదనలను తప్పుపడుతూ.. వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా సంచలన అభిప్రాయాలను పంచుకున్నారు. రాజధాని పేరుతో సాగుతున్న ఈ రాజకీయ క్రీడను, అమరావతి పేరిట జరుగుతున్న వేల కోట్ల అవినీతిని ఆయన తీవ్రంగా ఎండగట్టారు.

రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు దాటినా, ఇంకా రాజధాని ఎక్కడ ఉండాలనే చర్చ జరగడం అందరూ సిగ్గుపడాల్సిన విషయం. రాజధాని ఎంపికపై శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ఎందుకు పక్కనపెట్టారు? విభజన చట్టంలోనే విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి (వీజీటీఎం) కాన్సెప్ట్ ఉంది కదా, ఈ ప్రాంతమంతటికీ భవనాలను విస్తరిస్తే తప్పేంటి? రాష్ట్రం విడిపోయిన 15 ఏళ్ల తర్వాత వచ్చే 2029 జనరల్ ఎన్నికల్లో కూడా రాజధాని ఎక్కడో ప్రజలే నిర్ణయించాలా? ఈ పొలిటికల్ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ఆపాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందని ఆయన హితవు పలికారు. అలాగే, మొదటి విడతలో ల్యాండ్ పూలింగ్‌కు భూములిచ్చిన రైతులకు ఇప్పటికీ ప్లాట్లు కేటాయించకపోవడాన్ని తప్పుపడుతూ.. రాజధానికి లక్ష ఎకరాలు ఏం చేసుకుంటారని ప్రశ్నించారు.

ప్రస్తుత ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో ఏకంగా రూ. 50 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, ప్రతి నిర్మాణంలోనూ వ్యయాన్ని భారీగా పెంచి చూపించారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. భారీ అవినీతికి వేసిన పథకానికే 'అమరావతి' అని అందమైన పేరు పెట్టారు. ఇది 'దేవతల రాజధాని' అని బ్రహ్మాండమైన అబద్ధపు బ్రాండింగ్ ఇచ్చారు. అధికారంలో ఉన్నవారు 25 నుంచి 30 శాతం లంచాలు (దాదాపు రూ. 15 వేల కోట్లు) గుంజడానికే ఈ బ్రాండింగ్‌ను వాడుకుంటున్నారు. అసలైన అమరావతి దైవ క్షేత్రం దానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ అమరావతి కృష్ణమ్మ ప్రవహిస్తున్న క్షేత్రం అయితే.. ఈ అమరావతి అవినీతి పారుతున్న క్షేత్రం అని

విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

ఈ ప్రధానమైన అవినీతిని వదిలేసి, ప్రతిపక్షం ‘మావిగన్’ అనడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని నిర్మాణం అంటే ఏ పార్టీ ఎంత కమీషన్లు కొట్టాలనేది కాదు కదా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో, అమరావతి పేరిట జరుగుతున్న ఈ అవినీతి యజ్ఞాన్ని ప్రజల తరఫున నిలదీస్తూ, నిర్మాణ వ్యయం పెంపుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆధారాలతో త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతున్నట్లు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు
VijayaSaiReddyYSRCPAmaravatiAndhraPradeshAPPoliticsCapitalIssueMaviganAmaravatiCapitalAndhraNewsPoliticalNewsTeluguNewsAPNewsYSJagan
అమరావతి అవినీతిపై కోర్టుకు వెళ్తా: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి - Tholi Paluku